నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు చాలా చిన్న‌ద‌నుకున్నా. ఓ పట్టుప‌డితే గానీ తెలిసి రాలేదు ఎంత పెద్ద‌దోన‌న్న విష‌యం. మీరూ నాలాగే ఇంట్లో ఖాళీగా ఉన్నారా..? అయితే నేను చేసిన‌ట్టు చేయండంటూ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది భార‌తి సింగ్. అయినా, ఈ భార‌తి సింగ్ ఎవ‌ర‌నేగా మీ డౌట్. మ‌నకు బ్ర‌హ్మానందం, త‌మిళ తంబీల‌కు వ‌డివేలు ఎలానో బాలీవుడ్ జ‌నాల‌కు భార‌తి సింగ్ అలాగ‌న్న మాట‌. మ‌హిళా క‌మెడియ‌న్‌ భారతి సింగ్. ఇంత‌కీ అస‌లు విష‌యానికొస్తే వివ‌రాలిలా ఉన్నాయి.

జీవితం ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కుండా అంద‌రి స‌ర‌దా తీర్చేస్తుంద‌ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఏ ముహూర్తాన చెప్పాడో కానీ, అక్క‌డిదాకా ఎందుకు బాసూ నేనున్నానుగా అంటూ వ‌చ్చేసింది క‌రోనా. పుట్టినిల్లు వ్యూహానే అయినా చైనా ఎల్ల‌ల‌ను దాటి ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల్లో మృత్యు ఘంటిక‌లు మోగిస్తోంది. చిన్నా పెద్దా అన్న తేడా ఏ మాత్రం లేకుండా అంద‌రిపై ప్ర‌భావం చూపుతోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్పటికే వేల మంది మృత్యువాత‌ప‌డ‌గా, మ‌రికొంద‌రు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు.

మ‌రోప‌క్క క‌రోనా వైర‌స్‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. క‌రోనా.. క‌రోనా నువ్వేం చేస్తావ్‌..? అని అడిగితే ప్ర‌పంచాన్ని వినాశ‌పుటంచుల‌దాకా తీసుకెళ్తానంద‌ట అంటూ కొంద‌రు, కుటుంబ స‌భ్యుల‌ను ఒక్క‌చోట‌కు చేర్చిందంటూ  ఇంకొంద‌రు క‌రోనాపై ఎవ‌రికి వారు వారికిష్ట‌మొచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ గ‌డువును పెంచే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్న అభిప్రాయాల‌ను వైద్య నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. భార‌త్‌లో అంతకంత‌కు పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా వారు చెప్పుకొస్తున్నారు.

ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలతో స‌హా ప్ర‌తీ ఒక్క‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి విధిత‌మే. అందులోనూ ఇళ్ల‌కు ప‌ని మ‌నుషులు రాక‌పోయేస‌రికి గ్యాప్ వ‌చ్చిన ప‌నుల‌ను షూరు చేయాల్సిన ప‌రిస్థితి. యాంక‌ర్ సుమ అయితే ఏకంగా ప‌ని మ‌నిషిపై పాట కూడా పాడేసింది. ఇలా ఎవ‌రింటి ప‌నులు వారు చేసుకునే సెల‌బ్రిటీల జాబితాలో బాలీవుడ్ మ‌హిళా క‌మెడియ‌న్ భార‌తి సింగ్ చేరిపోయారు. ఏకంగా పాత త‌డిగుడ్డ ఒకటి చేత‌బ‌ట్టి ఇంటిలోప‌లి గ‌చ్చుపై ఓ రౌండ్ వేసేసింది.

అలా ఇంటి ప‌నులు చేసుకుంటూ తీసిన ఓ వీడియోనుభార‌తి సింగ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. మొన్న‌టి వ‌ర‌కు త‌న ఇళ్లు చాలా చిన్న‌దిగా ఉంద‌ని భావించాన‌ని, కానీ, త‌డి గుడ్డ‌తో ఇంటిని శుభ్రం చేస్తుంటే త‌న ఇళ్లు ఎంత పెద్ద‌దో అన్న విష‌యం తెలిసొచ్చిందంటూ వీడియోలో చెప్ప‌క‌నే చెప్పుకొచ్చింది భార‌తి సింగ్‌. ఎవ‌రికైనా వారి వారి ఇళ్లులు చిన్న‌విగా అనిపిస్తే.. త‌నలాగే ఇంటిని శుభ్ర‌ప‌రిచే కార్య‌క్ర‌మం పెట్టుకోవాల‌ని, అలా చేస్తే ఇళ్లు చిన్న‌ద‌న్న ఆలోచ‌న రాద‌ని చెబుతోంది భార‌తి సింగ్‌.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.