ఈసారి ధోనిని పొగిడి.. కోహ్లీకి కౌంటర్ వేసిన గంభీర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2020 1:55 PM GMT
ఈసారి ధోనిని పొగిడి.. కోహ్లీకి కౌంటర్ వేసిన గంభీర్

గౌతమ్ గంభీర్ గతంలో చాలా విషయాల్లో మహేంద్ర సింగ్ ధోని మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా మాత్రం ధోని ఐపీఎల్ ప్లానింగ్ పై మంచి మార్కులు వేశాడు గంభీర్. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద మాత్రం ఎన్నో కౌంటర్లు వేశాడు. ఐపీఎల్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాలకు.. కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు పరాజయాలకు కారణాలు తెలిపాడు గంభీర్.

విరాట్‌ కోహ్లికి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. అసలు తన అత్యుత్తమ జట్టు ఎలా ఉండాలో కోహ్లి తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయని గతం గురించి గుర్తు చేశాడు. తాను ఆర్సీబీతో హ్యాపీగా ఉన్నానని కోహ్లీ అంటాడు కానీ తుది జట్టులోని పదకొండు మంది ఆటగాళ్ల గురించి ఎప్పుడైనా కసరత్తు చేశాడా అని ప్రశ్నించాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనే కోహ్లి భావన తప్పన్నాడు గంభీర్.

ధోని కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటాడని, కోహ్లి కెప్టెన్సీలోని ఆర్సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మార్చేస్తూ ఉంటుందని చెప్పాడు. సీఎస్‌కే సక్సెస్‌ కావడానికి, ఆర్సీబీ వైఫల్యం చెందడానికి కారణం ఇదేనని అన్నాడు గంభీర్‌. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుందన్నాడు. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉండి నిలకడ కోసం ప్రయత్నించాలన్నాడు. గంభీర్ సూచనలను ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకుందో లేదో వేచి చూడాలి.

ఐపీఎల్ 2020 లో భాగంగా మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య జరగనుంది. సెప్టెంబర్ 19న అట్టహాసంగా ఐపీఎల్ ఎడిషన్ మొదలుకానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సెప్టెంబర్ 21 తన మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.

Next Story