Fact Check : కంగనా రనౌత్ కు ఘన స్వాగతం పలుకుతామని రాజ్ థాక్రే ట్వీట్ చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Sept 2020 8:39 AMకంగనా రనౌత్ కు, శివ సేనకు మధ్య గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే..! ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ వ్యాఖ్యలను శివసేన నేతలు తప్పుబట్టారు. ఆమెను ముంబైలోకి రానిచ్చే అవకాశమే లేదని అన్నారు. కానీ సెప్టెంబర్ 9న ముంబై లోకి కంగనా రనౌత్ అడుగుపెట్టింది. ఆమె వచ్చే సమయంలో కూడా హైడ్రామా నెలకొంది. ఆమె ఆఫీసును ముంబైలో కూల్చి వేయడం కూడా జరిగింది.
ఇలాంటి సమయంలో రాజ్ థాక్రే కు సంబంధించిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 4, 2020న @IRajThackeray29 అనే ట్విట్టర్ ఖాతాలో 'సెప్టెంబర్ 9న హిందూ శివంగి కంగనా రనౌత్ కు మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ స్వాగతం పలకబోతున్నాం. సంజయ్ రౌత్ మీకు ధైర్యం ఉంటే ఆపండి' అంటూ ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
కంగనా రనౌత్ ఓ వైపు శివసేన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటే రాజ్ థాక్రే చేసిన ట్వీట్ ఏమిటంటూ పలువురికి క్లారిటీ లేకుండా పోయింది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'. అది రాజ్ థాక్రే అధికారిక ఖాతా నుండి వచ్చిన ట్వీట్ కాదు.
న్యూస్ మీటర్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎం.ఎన్.ఎస్.) అధికారిక ఖాతాను పరిశీలించగా ఆయన అలాంటి ట్వీట్ ఏదీ చేయలేదు. రాజ్ థాక్రే తన అధికారిక ఖాతాను మే 2017న క్రియేట్ చేశారు. ట్విట్టర్ కూడా వెరిఫై చేసింది. 7,28,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రాజ్ థాక్రే అధికారిక ఖాతా @RajThackeray ఇది కాగా.. వైరల్ అవుతున్న ట్వీట్ @IRajThackeray29 ఖాతా నుండి వచ్చింది. కాబట్టి ఇది అఫీషియల్ ఖాతా కాదు. 2020లో ఈ ఖాతాను తెరచారు. ఇదొక ఫేక్ అకౌంట్..!
కంగనాకు శివసేనకు మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండడంతో రాజ్ థాక్రే ట్వీట్ చేశారంటూ ఈ ట్వీట్ ను వైరల్ చేశారు. కానీ ఆ ట్వీట్ కు రాజ్ థాక్రేకు ఎటువంటి సంబంధం లేదు.
కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేత కూడా బుధవారం నాడు జరిగిపోయింది. దీనిపై కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘ఉద్ధవ్ థాక్రే మీరు ఏమనుకుంటున్నారు. మూవీ మాఫీయాతో చేతులు కలిపి నా భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు నా ఇల్లు కూలిపోయింది.. రేపు మీ అహంకారం కూలిపోతుంది’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఒక విధంగా మీరు నాకు సహాయం చేశారు. కశ్మీరీ పండితులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది, ఈ రోజు అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ సందర్భంగా నేను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నా.. ఒక అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపై కూడా సినిమా తీస్తాను.. జై హింద్.. జై మహారాష్ట్ర అంటూ వీడియోను ముగించింది కంగనా.
"మీ నాన్న చేసిన మంచి పనులతో మీకు సంపద లభించింది. మీ గౌరవాన్ని మాత్రం మీరే సంపాదించుకోవాలి. నా నోటిని మీరు మూయించవచ్చు కానీ, నా గొంతు కోట్లాది మందిలో ప్రతిధ్వనిస్తుంది. ఎందరి నోళ్లు మీరు మూయించగలరు? ఎంత మందిని నొక్కి పెట్టగలుగుతారు? ఎప్పుడైతే వాస్తవం నుంచి మీరు తప్పించుకోవాలని భావిస్తారో, అప్పుడు మీరు రాజవంశానికి నమూనాగా తప్ప ఇంకేమీ కాదన్న సంగతిని గుర్తుంచుకోండి" అని ట్వీట్ పెట్టింది.
కంగనా గురించి ట్వీట్లు చేస్తున్న ఫేక్ ట్విట్టర్ ఖాతాల గురించి న్యూస్ మీటర్ తెలుసుకుంది. @RealThackeray నుండి @ThackerayOffic అంటూ ఆఖరికి @IrajThackeray29 గా అకౌంట్ పేరును మార్చుకోవడం గమనించవచ్చు.
ట్విట్టర్ లో పలు ఫేక్ అకౌంట్లు రాజ్ థాక్రే పేరు మీద ఉన్నాయి. @RaajThakrey, @realthakare, @proudhindu29 ఈ అకౌంట్లు రాజ్ థాక్రే పేరు మీదున్న ఫేక్ అకౌంట్లు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చాలా విషయాలను ఈ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కంగనా రనౌత్ కు మద్దతుగా పలు పోస్టులు పెట్టారు.
గతంలో కూడా రాజ్ థాక్రే ఫేక్ అకౌంట్స్ కారణంగా ఇబ్బంది పడ్డారు. 2012 లో తన ఫేక్ అకౌంట్లను డిలీట్ చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ మరణంపై ఆయన ట్వీట్ చేశారంటూ ఓ ఫేక్ ట్వీట్ వైరల్ అయింది. తాను ట్వీట్ చేయలేదని.. కనీసం ట్విట్టర్ అకౌంట్ లేదని ఆయన వెల్లడించారు.
తాజాగా కూడా వైరల్ అవుతున్న పోస్టు రాజ్ థాక్రే చేసినది కాదు. అదొక ఫేక్ అకౌంట్ నుండి వచ్చిన పోస్టు. వైరల్ అవుతున్న పోస్టు అబద్ధం.