హైదరాబాద్‌: లష్కర్‌ ఏ తోయిబా ఉగ్రవాది కరీం తుండా కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న కరీంను పోలీసులు భారీ భద్రత మధ్య నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. దేశవ్యాప్తంగా పలు బాంబ్‌ కేసుల్లో నిందితుడైన తుండాను ఏడేళ్ల క్రితం నేపాల్‌ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పిటి వారెంట్‌ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అంతకముందు కొన్నేళ్ల పాటు తుండా పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. యువకులను ఉగ్రవాదంపై తుండా మళ్లించాడు.

తాంజిమ్‌ ఇస్లామిక్‌ ముజాహిద్దీన్‌ అనే ఉగ్రవాద సంస్థలో కూడా తుండా కీలక పాత్ర పోషించాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు తుండా కుట్ర పన్నాడు. హుమాయూన్‌ నగర్‌, సీసీఎస్‌ ప్రాంతంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ వద్ద తుండా టిఫిన్‌ బాక్సుల్లో బాంబులు అమర్చాడు. కాగా తుండాతో పాటు జలిస్‌ అన్సారీ ఈ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. 1993 వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్‌ కరీం తుండా.. ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో సైతం బాంబులు అమర్చాడు. కాగా తుండా కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story