సచిన్, లారాలపై గిలెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు
By తోట వంశీ కుమార్ Published on 20 April 2020 7:27 AM GMTభారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా లు క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్లుగా కీర్తి గడించారు. ఒకరు వన్డేల్లో తొలిసారి ద్విశతకం సాధించిన ఆటగాడు కాగా.. మరొకరు సాంప్రదాయ క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని 400 పరుగులు సాధించిన ఆటగాడు. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్ మెన్ అనే ప్రశ్న ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ కి ఎదురైంది.
తాజాగా.. ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా జాసన్ గిలెస్పీకి ఈ ప్రశ్న ఎదురైంది. సచిన్, లారా ఇద్దరిలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరో తేల్చుకోవడం కష్టమేనని ఈ ఆస్ట్రేలియా బౌలర్ సమాధానమిచ్చాడు. ఇద్దరు భిన్నమైన ఆటగాళ్లు. అయితే.. సచిన్ తో పోల్చుకుంటే లారా వికెట్ తీయడం కొంచెం ఈజీ. ఎందుకంటే.. లారా భారీ షాట్లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటాడు. దీంతో ఎక్కడో ఒక చోట తప్పు చేసి దొరికి పోతాడు. అయితే.. సచిన్ అలా కాదు. సాలీడ్ డిఫెన్స్ సచిన్ సొంతం. పరుగులు చేయడానికి తొందర పడడు. చెత్త బంతులనే బౌండరీలకు తరలిస్తాడు. దీంతో సచిన్ వికెట్ తీయడం కష్టమనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాను లారా వికెట్‌ను తీసేందుకే ఎక్కువగా ఇష్టపడుతానని చెప్పాడు. వారిద్దరూ గొప్ప ఆటగాళ్లని, వాళ్లతో కలిసి క్రికెట్ ఆడినందుకు ఎంతో గర్వపడుతున్నానని వెల్లడించాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.