ఆ రెండు కారణాల వలనే సచిన్ ఎప్పుడూ నన్నే మొదటి బంతిని ఆడమనేవాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 July 2020 7:30 AM GMTసచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ ఓపెనర్లంటే ఇలా ఉండాలి అనిపించేలా వారి బ్యాటింగ్ సాగింది. 176 వన్డేలలో ఇద్దరూ భారత్ కు ఓపెనర్లుగా ఆడారు. కానీ ఎప్పుడూ సౌరవ్ గంగూలీనే మొదటి బంతిని ఆడమనే వాడట సచిన్ టెండూల్కర్. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే.. కానీ సచిన్ ఎందుకు మొదటి బాల్ ను ఆడడానికి పెద్దగా ఇష్టపడడో సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించాడు. అందుకు సచిన్ దగ్గర రెండు జవాబులు ఉండేవని గంగూలీ వెల్లడించాడు.
భారత జట్టు ప్రస్తుత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తాజాగా వీడియో ఛాట్ సెషన్ లో గంగూలీతో మాట్లాడాడు. సచిన్ టెండూల్కర్ కంటే మీరే ఎక్కువ సార్లు మొదటి బాల్ ను ఆడేవారు ఎందుకు అని ప్రశ్నించాడు. అందుకు గంగూలీ నవ్వుతూ 'సచిన్ ప్రతి సారీ నన్నే మొదటి బంతిని ఆడమనే వాడు.. నువ్వే మొదటి బంతిని ఫేస్ చేయొచ్చు కదా అని అడిగినప్పటికీ సచిన్ దగ్గర రెండు సమాధానాలు ఉండేవి.. తాను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మొదటి బంతిని ఆడడం ఎందుకు.. అది అలాగే కొనసాగాలి అంటే నేను నాన్ స్ట్రైకర్ ఎండ్ లోనే ఉంటాను అని చెప్పే వాడు సచిన్.. ఒక వేళ సరైన ఫామ్ లో లేకపోతే నేను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉంటే నా మీద ప్రెజర్ ఉండదు' అని చెప్పి తప్పించుకునేవాడు అని మయాంక్ తో ముచ్చటిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
BCCI.tv లో మయాంక్ ఈ ఆసక్తికర ప్రశ్నను గంగూలీని అడిగాడు. కొన్ని కొన్ని సార్లు తాను నాన్-స్ట్రైకర్ ఎండ్ లో కావాలనే నిలబడిపోవడం.. అప్పటికే టీవీల్లో తాము కనిపిస్తూ ఉండడం వలన సచిన్ బలవంతంగా మొదటి బాల్ ను ఫేస్ చేసేవాడని.. అది కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే జరిగిందని గంగూలీ తెలిపాడు. సచిన్ కూడా కొన్ని నమ్మకాలను బాగా ఫాలో అవుతాడన్నమాట.
సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించింది. 176 ఇన్నింగ్స్ లలో ఈ జంట 8227 పరుగులు చేసింది. 47.55 యావరేజ్ తో ఈ జోడీ పరుగులు చేయడం విశేషం. 26 వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, 29 యాభై పరుగుల భాగస్వామ్యాలను ఈ జోడీ నమోదు చేసింది. 2001 లో పార్ల్ లో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో 258 పరుగుల భారీ ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను నమోదు చేశారు. వీరి జోడీ చేసిన హయ్యస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ గా 258 పరుగులు రికార్డుల్లోకి ఎక్కింది.