చిత్తూరు: దేశం కానీ దేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు. చిత్తూరు జిల్లా కేవీ మండలంకు చెందిన దిల్లీ రాణి, రాజమ్మ, సదుం మండలానికి చెందిన విజయ్‌తో పాటు కొందరు మహిళలు ఏజెంట్‌ల ద్వారా ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లారు. తెలుగు మహిళలను అక్కడి ఏజెంట్లకు అమ్మివేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏజెంట్లు మోసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

అక్కడే వివిధ పనుల్లో చేరిన ఆ మహిళలకు కంపెనీలు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఆ మహిళలు వారి యాజమానుల నుంచి తప్పించుకొని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని ఓ వీడియో రూపంలో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. తమను ఇక్కడ కంపెనీలు దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వీడియోలో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భారత రాయబార అధికారులు తమను పట్టించుకోవడం లేదని, పాస్ట్‌పోర్టు వచ్చే వరకు ఇక్కడే ఉండాలని అంటున్నారని మహిళలు చెబుతున్నారు. తాము స్వదేశానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తమను రక్షించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

అంజి

Next Story