జగన్ జగనే.. ఆయన ఎన్నటికీ కేసీఆర్ కాలేరు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jan 2020 10:54 AM GMT
జగన్ జగనే.. ఆయన ఎన్నటికీ కేసీఆర్ కాలేరు.!

తెలంగాణలో కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో కూడా ఎవరికీ తెలియదు. కేసీఆర్ కు సలహాదారులెవరూ ఉండరు. అన్ని నిర్ణయాలూ ఆయనవే. అన్నిట్లోనూ ఆఖరి మాట ఆయనదే. జగన్మోహనరెడ్డికి కూడా సలహాదారులెవరూ ఉండరు. అన్ని నిర్ణయాలూ ఆయనవే. అన్నిట్లోనూ ఆఖరి మాట ఆయనదే. కేసీఆర్ దగ్గరకి ఎవరూ వెళ్లలేరు. జగన్ దగ్గరకీ ఎవరూ వెళ్లలేరు. కేసీఆర్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. జగన్ కూడా ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. కేసీఆర్ కు టీవీ చానెల్ ఉంది. పత్రిక కూడా ఉంది. జగన్ కు కూడా సొంత టీవీ చానెల్, న్యూస్ పేపర్ ఉన్నాయి.

Politics

కానీ కేసీఆర్ కేసీఆరే. జగన్ జగనే. జగన్ కేసీఆర్ ఎప్పటికీ కాలేరు. కేసీర్ పక్కన బెట్టినా, పదవి ఇవ్వకపోయినా అల్లుడు హరీశ్ రావ్ తిరుగుబాటు చేయలేడు. రాజ్యసభ కి మళ్లీ పంపకపోయినా కేకే నోరు మెదపలేడు. గతంలో హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఆయన అల్లుడికి ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు. కానీ నాయని వంటి సోషలిస్టు యోధానయోధుడు, లేబర్ లీడర్ గారు చేతులు కట్టుకునే ఉన్నారు. చేష్టలుడిగి చూస్తున్నారు. ఖమ్మం జిల్లా పోరాటవీరుడు తుమ్మల నాగేశ్వరరావును శంకరగిరి మాన్యాలు పట్టించాడు. కానీ ఆయన నోరు మెదపడం లేదు. మాట వినని ఆర్టీసీ సమ్మెకారుల దిమ్మదిరిగేలా దెబ్బ కొట్టాడు. 52 రోజులు సమ్మె చేసినా కార్మికులు ఖాళీ చేతులతోనే మిగిలిపోయేలా చేశాడు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి అడ్రస్ లేకుండా పోయేలా చేశాడు.

జగన్మోహన్‌ రెడ్డి పదవి ఇవ్వనందుకు రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. రోజా వంటి వారు అలిగి కూర్చున్నారు. జగన్ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించడం మానేశారు. చెవిరెడ్డి బాస్కర రెడ్డి కి మంత్రి పదవి లేదు. ఆయనలో గతంలోని ఉత్సాహం లేదు. అంతెందుకు? అమరావతి మీద ఆయన మూడు రాజధానుల బాణం సంధిస్తే, పార్టీ ఎమ్మెల్యే ఒకరు తిరుగుబాటు స్వరం వినిపించాడు. తరువాత ఎలాగోలా దారికి తెచ్చుకున్నా, చాలా మంది ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉన్నారు.

Manchu Tuffan In Bjp 640x480

కుటుంబ సభ్యుడు, ఆప్తుడు నటుడు మోహన్ బాబు జగన్ కి తెలియకుండానే ఢిల్లీకి వెళ్లారు. కొడుకు విష్ణు, కోడలు విరానికా, కూతురు మంచు లక్ష్మిలతో సహా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ మెంట్ పొందాడు. మోదీతో అరగంటపాటు సమావేశమయ్యడు. ప్రధానికి గిఫ్టులు ఇచ్చారు. ఫోటో దిగారు. తిరిగి వచ్చేశారు. ఇది నేరుగా జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టే. జగన్ ను సవాలు చేసినట్టే. కష్టకాలంలో పార్టీకి మద్దతుగా గొంతుచించుకున్న పోసాని కృష్ణ మురళి కూడా పార్టీకి దూరమౌతున్నాడు. జగన్ నే విమర్శించే సాహసాన్ని చేస్తున్నాడు. పృథ్వీ చేసిన కామెంట్లపై పోసాని విరుచుకుపడ్డ తీరు జగన్ నాయకత్వాన్ని సవాలు చేసినట్టుగానే ఉంది.

Image result for raghu rama krishnam raju modi

ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీలో ఉన్నాడా లేడా ఎవరికీ తెలియడం లేదు. ఆయన బిజెపి నేతలకు చాలా దగ్గర. విందు ఏర్పాటు చేస్తే వైకాపా నేతలకు ఆహ్వానం ఉండదు. మొత్తం బీజేపీవారందరూ హాజరవుతారు. జగన్ కుడిభుజం విజయసాయి రెడ్డి, ఎడమ భుజం మిథున్ రెడ్డిలు అమిత్ షాను కలిసేందుకు గంటల పాటు ఎదురుచూస్తూండగా, రఘురామకృష్టం రాజు అలా వచ్చి, ఇలా దూరి, అలా కలిసి, ఇలా వెళ్లిపోతున్నాడు. అమిత్ షా దగ్గర ఆయనకున్న పరపతి ఎవరికీ లేదు. విజయసాయి, మిథున్ రెడ్డిలు బతిమాలినా, బామాలినా జగన్ కు షా అపాయింట్ మెంట్ దొరకలేదు. కానీ రఘురామకృష్ణం రాజుకి మాత్రం ఎనీ టైమ్ ఎంట్రీ. మోదీ స్వయంగా “రాజుగారూ ...కైసే హై” అని ఆయనను పలకరించేస్తున్నాడు.

కేసీఆర్ విషయంలో ఇలా ఎవరైనా చేయగలరా? ఆయనకు నచ్చని ఒక్కపనినైనా చేయబూనుకోగలరా? ఆయన నాయకత్వాన్ని సవాలు చేయగలరా? ఆయనను కాదని నేరుగా మోదీనో, అమిత్ షానో కలవగలరా? అందుకే కేసీఆర్ కేసీఆరే. జగన్ జగనే. జగన్ ఎన్నటికీ కేసీఆర్ కాలేరు.

Next Story