ఏపీ క‌రోనా నాలుగు పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్‌కు లింక్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 March 2020 6:46 AM GMT
ఏపీ క‌రోనా నాలుగు పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్‌కు లింక్.!

మార్చి 22 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అయిదుగురు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో నలుగురికి హైదరాబాద్ తో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వారు సంచరించినట్లు తెలియడంతో హైదరాబాద్ లోని అధికారులు అప్రమత్తమయ్యారు. నలుగురిలో ఇద్దరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి ప్రైవేట్ క్యాబుల్లో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారని అంటున్నారు. మరో ఇద్దరు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వాడారని తెలుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ, ట్రైన్ లలో వారు ప్రయాణించినట్లు చెబుతున్నారు. ఆదివారం నాడు జి.హెచ్.ఎం.సి. అధికారులు, హెల్త్ వింగ్ అధికారులు ప్రత్యేకమైన శానిటైజేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని రెండు పాజిటివ్ కేసుల్లో పి2, పి3 కాచీగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే స్టేషన్ లో శానిటైజేషన్ పనులను పూర్తీ చేశారు అధికారులు.

పి2 మార్చి 11న హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత అతను ట్యాక్సీ తీసుకుని ఎల్లారెడ్డి గూడలో ఉన్న తన స్నేహితుడి రూమ్ కు చేరుకున్నాడు. అక్కడ మూడు రోజుల పాటూ ఉన్నాడు. మార్చి 14, రాత్రి 9 గంటల సమయంలో ఉబెర్ లో క్యాబును బుక్ చేసుకుని.. కేపీహెచ్బీ బస్ స్టాండ్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒంగోలుకు వెళ్ళాడు.

ఈ రిపోర్టులు హైదరాబాద్ లోని అధికారులకు చేరాయి. దీంతో ఎల్లారెడ్డిగూడను రెడ్ జోన్ గా ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ ను జల్లడం మొదలుపెట్టారు. అలాగే శానిటైజేషన్ పనులను కూడా చేపట్టారు.

తాము డోర్-టు-డోర్ డ్రైవ్ ను రెట్టింపు చేపట్టామని.. ఇప్పటి వరకూ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరూ లేరని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.

ఇక పి3 కూడా సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ కు చేరుకున్నాడు. మార్చి 9 నుండి 11 వరకూ హైదరాబాద్ లోనే ఉన్నాడు. అతడు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పలేకపోయారు అధికారులు. కానీ అతడు మార్చి 11న కాచీగూడ ఎక్స్ ప్రెస్ ద్వారా వైజాగ్ కు చేరుకున్నాడు. ఇప్పటికే జీహెచ్ఎంసి అధికారులు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తీ సమాచారాన్ని సేకరించారు. ఆ వ్యక్తులు గత రెండు రోజులు ఎవరెవరితో కలిసి తిరిగారో వారందరినీ అధికారులు పరీక్షించారు.. వారెవరిలోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.

క్వారంటైన్ పూర్తికాకుండానే ప్రయాణాలు మొదలెట్టేయడం వారిని పట్టుకోవడం పోలీసులకు, అధికారులకు తలకు మించిన భారంగా మారింది. నిన్న ఒక్క రోజే వందలాదిమందిని పోలీసులు గుర్తించి మళ్లీ క్వారంటైన్‌కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఇటువంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. క్వారంటైన్‌లో ఉండాల్సిన కొందరు ఏపీ వాసులు రైలు ప్రయాణం చేస్తుండగా గుర్తించిన అధికారులు వారిని గుర్తించి దించివేశారు. కొంచెం కూడా బాధ్యతలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా వైరస్ ప్రబలే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి.

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో హోం క్వారంటైన్ పాటించని నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు దంపతులు ఖతర్ నుంచి జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఉన్న అత్తగారింటికి వచ్చారు. విషయం తెలిసిన వైద్యాధికారులు దంపతులతోపాటు వారి అత్తమామలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.

Next Story