ఆదివారం జనతా కర్ఫ్యూతో అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పాలు, కూరగాయలు మినహా నాన్ వెజ్ షాపులతో సహా అన్నింటినీ మూసివేశారు. సోమవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో రైతుమార్కెట్లలో కూరగాయల కోసం ప్రజలు పోటెత్తారు. పెద్దఎత్తున వినియోగదారులు కూరగాయల కోసం వస్తుండటంతో అప్పటి వరకూ కిలో రూ.30, రూ.40 అమ్మిన కూరగాయల ధరలను రూ.60, రూ.80 కి పెంచేశారు వ్యాపారులు. దీంతో సాటి మధ్యతరగతి కుటుంబాల వారు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ధరలు పెంచేస్తే ఇక తాము ఎలా కూరగాయలు కొనేదంటూ వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా..కూరగాయలు కొనలేని వారికి ఆ భారాన్ని తగ్గించేందుకు నాన్ వెజ్ సెంటర్లు తీసే ఉంటాయని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. అలాగే చికెన్, మటన్ వంటివి తినడం వల్ల మనలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, తగిన మోతాదులో పోషకాల విలువలు కూడా లభిస్తాయన్నారు. అందుకే నాన్ వెజ్ కూడా తినడం మంచిదేనని మంత్రి పేర్కొన్నారు. చికెన్, మటన్ తినడం వల్ల కరోనా వస్తుందని వచ్చిన వదంతులన్నీ అబద్ధాలని మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.