ప్రాణాంతకమైన వైరస్‌ల శక్తి ఎంతో తెలిస్తే షాకవుతారు

By సుభాష్  Published on  23 March 2020 6:00 AM GMT
ప్రాణాంతకమైన వైరస్‌ల శక్తి ఎంతో తెలిస్తే షాకవుతారు

ముఖ్యాంశాలు

► ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 20వేల వైరస్‌లు

► కొన్ని వైరస్‌లకు చికిత్స ఉండదు, నివారణ ఒక్కటే మార్గం

► కంటికి కనబడని వైరస్‌లు ప్రాణాలు తీస్తున్నాయి

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది ప్రజలను కరోనా వైరస్‌ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఎవరికి ఎలాంటి మృత్యువు ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ మహమ్మారిలు జీవన శైలిని మార్చేసింది. ఇక కొన్ని వైరస్‌లకు చికిత్స ఉండటం లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రాణాంతకమైన వైరస్‌లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు వైరస్‌లు ఏమిటీ..? ఇటీవల కాలంలో వివిధ దేశాలను సైతం గజగజ వణికించాయి.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3 లక్షల 20వేల వైరస్‌లు ఉన్నాయి

ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3 లక్షల 20వేల వైరస్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. వైరస్‌ అంటే లాటిన్‌ భాషలో 'విషం' అని అర్థం. ఇవి అతి సుక్ష్మాతి సుక్ష్మమైన జీవులే కానీ అత్యంత శక్తివంతమైనవి. బ్యాక్టీరియా, ఫంగస్‌ కంటే అవి చాలా శక్తివంతంగా దాడి చేస్తాయి. ఎంతంటే దాడి చేయగానే మనిషి చనిపోయేంత ప్రభావం ఉంటుంది. ఇవి కంటికి కనిపించవు. కొన్ని రకాల వాటిని మైక్రోస్కోప్‌ల ద్వారా చూడగలం. ఈ వైరస్‌లు సంతానాన్ని వాటంతట అవే సృష్టించుకుంటాయి. కణజాలం ఉంటేనే అవి అభివృద్ధి చెందుతాయి. అడవి జంతువులు, మొక్కల నుంచి ఈ వైరస్‌లు మానవ శరీరాలపై దాడులు చేస్తాయి. వీటి కారణంగానే మనుషులు వివిధ రకాల జబ్బులకు గురై ప్రాణాలు పోయే పరిస్థితి దాపురిస్తోంది. ఫ్లూ, జికా, ఎబోలా, డెంగీ, సార్స్‌, మెర్స్‌, ప్రస్తుతం కరోనా ఇలా ఎన్నో రకాల వైరస్‌లు మానవాళికి ప్రమాదాల ఊబిలో నెట్టేస్తున్నాయి.

ఒక్క వైరస్‌ ఎన్ని వైరస్‌లు సృష్టించగలదు

ఒక్క వైరస్‌ మరో 10వేల వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే భూమి మీద ఉండే మనుషుల కంటే 10వేల రెట్లు ఎక్కువ వైరస్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక మన శరీరంలో కూడా ఎన్నో వైరస్‌లు ఉన్నప్పటికీ చాలా వైరస్‌లు నిద్రాణస్థితిలోఉంటాయి. అందుకే వాటి వల్ల పెద్దగా హనీ ఉండదు. మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్‌లు విజృంభిస్తాయట. అంతుపట్టని వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో ఈ వైరస్‌ దాడి మొదలవుతుంది. ఈ వైరస్‌ల కారణంగా తీవ్ర జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇక విధంగా చెప్పాలంటే వైరస్‌లన్నీ హానికరమైనవే. అయితే కొన్ని మాత్రం ప్రాణాంతకమైన వైరస్‌లు ఉంటాయి. అమెరికన్‌ జర్నల్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద దాదాపు 3 లక్షల 20వేల రకాల వైరస్‌లు ఉన్నాయి.

స్వైన్‌ ఫ్లై..

ఈ వైరస్‌ పందుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకితే 10 శాతం మరణాలు సంభవిస్తాయి. స్వైన్‌ ఫ్లూ వ్యాధి మొదటగా పందుల్లో బయటపడింది. ఈ వైరస్‌ మనుషులకు సోకడం తక్కువే. అయితే 1918-19 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇది మనుషులకు సోకింది. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మందికి ఈ వైరస్‌ సోకిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ తర్వాత 2009లో మరోసారి మనుషులకు సోకి తన విశ్వరూపం చూపించుకుంది. మొత్తం ఈ వైరస్‌ 200 దేశాలకు పాకింది. ఈ వైరస్‌ కారణంగా దాదాపు 3 లక్షల మంది వరకు మృతి చెందారని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ వైరస్‌ సోకితే జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు బయటపడతాయి. ఒకవేళ డయోరియా వస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

డెంగీ..

ఈ వైరస్‌ ఫిలిఫ్పీన్స్‌, థాయ్‌లాండ్‌లో పుట్టింది. ఈ వైరస్‌ దోమల నుంచి సంక్రమిస్తుంది. డెంగీ వైరస్‌ సోకితే మరణాల రేటు 20 శాతం వరకు ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితమే డెంగీ వైరస్‌ ఆఫ్రికా దేశాలను గజగజ వణికించింది. 20వ శతాబ్దంలో ఈ వైరస్‌ 1950లో ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌లో మొదటిసారిగా బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఆసియా పసిఫిక్‌, కరేఇయన్‌ దేశాలకు పాకింది. భారత్‌లో కూడా ఈ వ్యాధి తీవ్రత అధికంగానే ఉంది. ఏడెస్‌ దోమ కాటుతో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏడెస్‌ వేగంగా అభివృద్ది చెందుతుంది. దీనిని టైగర్‌ దోమ అని కూడా అంటారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది డెంగీవ్యాధి అధికంగా ప్రబలే ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారు.

ఇక డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం.. ప్రతీ సంవత్సరం డెంగీ వ్యాధి 5 కోట్ల నుంచి 10 కోట్ల మందికి వ్యాపిస్తుంది. వారం రోజులకు పైగా జ్వరంతో తీవ్ర జ్వరంతో మనిషిని పీల్చిపిప్పి చేస్తుంది. అంతేకాదు డెంగీ తీవ్రత ఎక్కువ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా డెంగీ వ్యాధితో ఏడాదికి 25వేల మంది వరకు మృతి చెంది ఉంటారని అంచనా.

ఎబోలా..

ఈ వైరస్‌ ఆఫ్రికాలో పుట్టింది. ఇది గబ్బిలాల నుంచి సక్రమిస్తుంది. ఈ వైరస్‌ సోకితే 50 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్‌ జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలతో ప్రారంభమవుతుంది. ఒక్కోసారి శరీరం వెలుపల, లోపల కూడా రక్తస్రావం అవుతుంది. చివరికి బ్రెయిన్‌ హెమరేజ్‌తో మనిషి ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది. ఈ వైరస్‌ మొదటి సారిగా 1976లో ఆఫ్రికాలో బయటపడింది. సూడాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దేశాల్లో ఒకేసారి వ్యాపించిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను సైతం వణికించింది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్‌కు పెట్టారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది.

అయితే ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు 50శాతంగా ఉంది. ఈ రెండేళ్లలో దాదాపు 12వేల మంది మరణించారు. అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌కు చికిత్స కోసం మెడిసిన్‌ కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ వైరస్‌ రాకుండా వ్యాక్సినేషన్‌ కూడా ప్రయోగాల దశలో ఉంది. ఈ వైరస్‌ సోకిన వారిలో 85 శాతం ప్రాణాలో పోయిన వారే ఉన్నారు.

సార్స్‌..

ఈ వ్యాధి చైనాలో పుట్టింది. ఇది గబ్బివలాలు, పిల్లుల నుంచి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకితే 10 శాతం మంది వరకు చనిపోయే అవకాశం ఉంది. చైనాలో గూంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లో 2002లో మొదటిసారి సివియర్‌ అక్యూట్‌ రెస్పరేటరీ డిసీజ్‌ (సార్స్‌) వైరస్‌ బయటపడింది. కొద్ది వారాల్లోనే ఈ వైరస్‌ 37 దేశాలకు పాకింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటాయి. సార్స్‌ వ్యాధితో చైనా, హాంకాంగ్‌లోనే అధిక మరణాలు సంభవించాయి. ఈ వైరస్‌ వచ్చిన ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలపై నిషేధాలు విధించారు. ఆ దేశాల్లో ఉన్న తమ పౌరులను వివిధ దేశాలు వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. సార్స్‌ వ్యాధితో 2002-03లో 774 మంది మరణించారు. కొన్నివేల మందిపై ఈ వైరస్‌ ప్రభావం చూపింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ చాలా ఏళ్ల నుంచి తయారు చేస్తున్నారు కానీ.. సఫలం కాలేకపోతోంది. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్సలు ఉండవు. నియంత్రణే మార్గం. ఈ వైరస్‌ సోకినప్పుడల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపడుతుంది.

జికా..

ఈ వైరస్‌ ఉగాండాలో పుట్టింది. ఇది దోమల నుంచి సంక్రమిస్తుంది. డెంగీ తరహాలోనే జికా వైరస్‌ కూడా ఏడెస్‌ దోమ ద్వారా వస్తుంది. ఈ వైరస్‌ సోకితే జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కంటికి కలక, తీవ్రమైన కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1947లో ఉగాండాలో మొదటిసారిగా ఈ వైరస్‌ కోతుల్లో కనిపించింది. 1952 సంవత్సరం నాటికి ఈ వ్యాధి మనుషులకు సంక్రమించింది. ఉగాండా, యునైటెడ్‌ రిపబ్లిక్ ఆఫ్‌ టాంజానియాలో ఈ వ్యాధి ప్రబలింది. 1960-80 మధ్య కాలంలో కూడా ఈ వ్యాధి ఆసియా, అమెరికా, పసిఫిక్‌ దేశాలకు సంక్రమించింది. 2013లో ఈ వ్యాధి ఒక్కసారిగా ఫ్రాన్స్‌ లో విజృంభించింది. 30వేల మందికి ఈ వ్యాధి సోకింది. అప్పుడే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.

ఇక 2015లో బ్రెజిల్‌ని కూడా జికా వణికించింది. గర్భిణులకు ఈ వ్యాధి సోకి గర్భంలో ఉండే శిశువులకు సైతం సంక్రమించింది. కాగా, జికా వ్యాధితో పుట్టిన శిశువుల్లో మెదడు సక్రమంగా అభివృద్ధి కాదు. 2016లో జికా వ్యాధిని అదుపు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దోమకాటుతో పాటు లైంగిక సంపర్కం, రక్తం ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇలా చికిత్స సరిగ్గా లేని వైరస్‌లు మానవాళికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి వైరస్‌లు సంక్రమించినప్పుడు మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఈ వైరస్‌ బయటపడినప్పుడల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలను అప్రమత్తం చేస్తుంది. మరణాలు సంభవించకుండా పెద్ద ఎత్తున చేపడుతుంది. అలాగే ప్రస్తుతం సోకుతున్న కరోనా వైరస్‌ కూడా అంతే. ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.

Next Story