ఒక్కరోజు ఆర్భాటమేనా.?

By Newsmeter.Network  Published on  23 March 2020 6:13 AM GMT
ఒక్కరోజు ఆర్భాటమేనా.?

కరోనా వైరస్ బూచిని తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం యావత్ భారతం జనతా కర్ఫ్యూను తూ..ఛ తప్పకుండా పాటించింది. సాయంత్రం 5 గంటలకు ప్రతిఒక్కరూ రియల్ హీరోలైన డాక్టర్లకు చప్పట్లు, శంఖారావాలతో అభినందనలు కూడా తెలిపారు. కానీ..రాత్రి 9 గంటల నుంచే ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. 14 గంటలు ఇళ్లకే పరిమితమైన ప్రజలు..9కి ఒక్కనిమిషం అటూ ఇటూ కాకుండానే బయట తిరగడం మొదలు పెట్టారు.

ఆదివారం సాయంత్రమే కేంద్రం దేశ వ్యాప్తంగా 75 జిల్లాలను కరోనా బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ జిల్లాలన్నింటినీ ఈనెల 31వ తేదీ వరకూ లాక్ డౌన్ చేయాల్సిందిగా కూడా ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత వెంటవెంటనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ..రాష్ట్రాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిత్యావసరాలు మినహా ఇతర దుకాణాలేవీ తీసేందుకు వీల్లేదని చెప్పేశారు. అలాగే ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులతో పాటు..ప్రైవేట్ వాహనాలేవీ కూడా రోడ్లపై తిరగరాదని చెప్పారు. అత్యవసరమైన విధులు నిర్వహించాల్సిన వారు మినహా..ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ నెలాఖరు వరకూ సెలవులివ్వాల్సిందేనని తేల్చేశాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. కానీ..ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ 9 రోజుల వేతనాన్ని ఇవ్వాలని తెలిపాయి.

ప్రభుత్వాలిచ్చిన సూచనలు, ఆదేశాలన్నింటినీ ప్రజలు తుంగలోకి తొక్కారు. అంతా ఒక్కరోజు ఆర్భాటమేనని తేల్చేశారు. సోమవారం ఉదయం షరామామూలుగానే రోడ్లపై తిరుగుతున్నారు. పనిఉన్న వారు, లేనివారు కూడా సొంతవాహనాల పై తిరుగుతున్నారు. ఎందుకు బయటికొచ్చారని మీడియా ప్రశ్నిస్తే..సెలవులిచ్చారు కదా..మా సొంత ఊరికి వెళ్తున్నాం. సొంత పనిమీద వెళ్తున్నామంటూ సమాధానమిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని చెప్పినా..రైతు మార్కెట్లలో గుమిగూడుతున్నారు.

రామాపురం వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

Checkpost Traffic

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడంతో ఒక్క వాహనాన్ని కూడా పోలీసులు, టోల్ గేట్ సిబ్బంది రాష్ట్రంలోపలికి అనుమతించడంలేదు. దీంతో విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో హైదరాబాద్ కు వచ్చే వారందరినీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన నల్గొండ జిల్లా రామాపురం వద్దే ఆపేశారు. దీంతో ఆ రోడ్డు పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీయ నిర్భంధాన్ని పాటిస్తేనే కరోనాను కాస్త కట్టడి చేయగలం. సూచనలు పాటించకుండా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇష్టారాజ్యంగా తిరిగితే మాత్రం..దానికి ఎవరికి వారే బాధ్యులవుతారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తే తప్ప ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు.

Next Story