ఏపీలో రికార్డ్ స్థాయిలో టెస్టులు.. తెలంగాణ ప‌రిస్థితేంటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 6:45 AM GMT
ఏపీలో రికార్డ్ స్థాయిలో టెస్టులు.. తెలంగాణ ప‌రిస్థితేంటి?

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. నివారణకు ఉండే ప్రతి అవకాశాన్ని పక్కాగా వినియోగించుకోవాలి. ఆ లెక్కన చూస్తే.. రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించటం చాలా అవసరం. కానీ.. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు మొదట్నించి వెనుకబడే ఉంది. మహమ్మారి అంతు చూసే విషయంలో చాలా మాటలు చెప్పే కేసీఆర్.. పలు సందర్భాల్లో జాతీయ.. అంతర్జాతీయ విశ్లేషణలు చేయటం కనిపిస్తుంది.

ఈ సందర్భంగా ఆయన మాటలు విన్నప్పుడు మహమ్మారి మీద ఆయనకున్న అవగాహన చూస్తే ముచ్చటేస్తుంది. అంత విషయమున్న ఆయన.. తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేసుల నిర్దారణకు చేపట్టాల్సిన పరీక్షల్ని ఎందుకు నిర్వహించటం లేదన్నది ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. కిట్ల కొరత ఎక్కువగా ఉన్నందున ఆచితూచి ఖర్చు చేస్తున్నామన్న వాదనలో కూడా పస కనిపించదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కిట్ల కొరత ఉంటుందా? అన్నది ప్రశ్న.

ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరీక్షల విషయంలో తెలంగాణ కంటే ఎంతో ముందుంది. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సర్కారు శనివారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో ఇప్పటివరకూ మొత్తంగా చేసిన నిర్దారణ పరీక్షలు కేవలం 53,757 మాత్రమే. శనివారం ఒక్కరోజున చేసిన టెస్టులు 3188గా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీకి సంబంధించిన అధికారిక గణాంకాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది.

రోజులో (24 గంటల వ్యవధిలో) 22,371 పరీక్షల్ని నిర్వహించిన ఏపీ సర్కారు ఇప్పటివరకూ 6,52,377 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒకేరోజులో ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు క్రియేట్ చేసింది. మరి.. ఏపీలో నిర్దారణ పరీక్షలు ఈ స్థాయిలో చేస్తుంటే.. అందులో పది శాతం కూడా ఇప్పటివరకూ తెలంగాణరాష్ట్రం ఎందుకు చేయటం లేదన్నది అసలు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఈ విషయం మీద సీఎం కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Next Story