రేపు మరో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
By సుభాష్ Published on 18 Oct 2020 9:25 AM GMTదక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య భాగంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సోమవారం మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
రేపు ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురియగా, ప్రధానంగా మంగళ, బుధవారాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వర్షాలు మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఎందరో ప్రాణాలు విడిచారు. ఎన్నో వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు ఇళ్లల్లోకీ చేరడంతో ఎన్నో కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. భారీ వర్షాల ధాటికి ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పలు ఇళ్లు కూలిపోయి నగరంలో దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. ప్రస్తుతం నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కదిలించినా.. కన్నీటి పర్యంతమవుతున్నారు. నిత్యావసర సరుకులన్నీ నీటిలో మునిగిపోవడంతో తినేందుందుకు తిండిలేక ఇబ్బందులకు గురవుతున్నారు.