రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం

YSRTP Leader Sharmila Press Meet. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వైఎస్ఆర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా లేవని.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం

By Medi Samrat  Published on  16 July 2021 8:54 AM GMT
రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వైఎస్ఆర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా లేవని.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశంలో ష‌ర్మిల‌ మాట్లాడుతూ.. నాన్న‌ వైఎస్ఆర్‌ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని.. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని అన్నారు.

తాను ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా? అని ష‌ర్మిల‌ ప్ర‌శ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమని తానెప్పుడూ చెప్పలేదని.. సీఎం కేసీఆర్‌ మహిళలకు విలువ ఇవ్వరని.. టీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం ఉండదని ఆరోపించారు. ఇక కేటీఆర్ కూడా మ‌హిళ‌లు వ్రతాలే చేసుకోవాలని అంటున్నార‌ని.. నిరుద్యోగుల కోసం నేను వ్రతమే చేస్తున్నాన‌ని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై నాకెంతో గౌరవం ఉందని.. సీఎం అయ్యాక ఆయనలోని దొర బయటకొచ్చారని విమ‌ర్శించారు ష‌ర్మిల.

సీఎం కేసీఆర్‌ పాలనలో జనం ఇబ్బందులు చూడలేకే.. ప్రజల బాగోగుల కోసమే పార్టీ పెట్టాన‌ని. సీఎంగా కేసీఆర్‌ విఫలమయ్యారని.. జ‌న‌మిచ్చిన‌ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారని విమ‌ర్శించారు. కేసీఆర్‌ ఒక నియంతలాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. ప్ర‌శ్నించే వారు ఉండొద్దు అనుకుంటార‌ని అన్నారు. పార్టీ అంటే ఓ వ్యక్తికాదని.. ప్రజలు, వ్యవస్థ అని అన్నారు. తాను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుందని.. ఒంటరినని భయపడను.. బాధ లేదు.. రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తామ‌ని ష‌ర్మిల అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికపై మాట్లాడిన షర్మిల.. ఆ ఎన్నికకు అర్థమే లేదని.. పగలు, ప్రతీకారాల కోసమే ఉపఎన్నిక వచ్చిందని మండిప‌డ్డారు.

తాను ఏపీ సీఎం జగన్‌పై అలిగి నేను పార్టీ పెట్టాననడం సరికాదని.. అలిగితే మాట్లాడటం మానేస్తాం కానీ పార్టీలు పెట్టమ‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందని.. ఇక‌వేళ‌ రాకుంటే ప్రజలే తిరగబడతారని అన్నారు. జగన్‌, నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామ‌ని.. మా పరిధులకు కట్టుబడి ఉన్నామ‌ని ష‌ర్మిల అన్నారు. వైఎస్‌లాగే తాను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తాని షర్మిల తెలిపారు.




Next Story