ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్.. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారని రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని శపథం చేసి, అందుకు కృషి చేసేవారే రాజశేఖరరెడ్డికి నిజమైన వారసులన్నారు. దీనికి వ్యతిరేకంగా పనిచేసే వారు.. దివంగత నేతకు వ్యతిరేకులన్నారు. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నేతలు నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌మున్సి, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, 2009 మధ్య అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చాపర్ ప్రమాదంలో మరణించారు.