వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పొత్తులపై స్పందించారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు. తమది పేదలు, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోను పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదన్నారు. విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని, పార్టీ పెట్టి రెండేళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని ప్రశ్నించారు. తాను చేరుతానంటే వద్దనే పార్టీ ఉన్నదా అప్పుడే ఏ పార్టీలో చేరని తాను, ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి, నిజాయతీగా పాదయాత్ర చేశానని అన్నారు. ఢిల్లీ సంస్థ చేసిన సర్వేలో తమ పార్టీ 43 స్థానాల్లో బలంగా ఉందని తేలిందని చెప్పారు. పదికో, ఇరవైకో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. అన్ని పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తాయన్నారు. పొత్తుల కోసం తనకు కూడా మిస్డ్ కాల్స్ వస్తున్నాయని.. అయితే తాము చార్జింగ్ మోడ్ లోనే ఉన్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని షర్మిల అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం కాంగ్రెస్ లో ఉందని.. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ మాదే అని ఎవరి దగ్గర సీట్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదన్నారు.