కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది.? : వైఎస్ షర్మిల

ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు..

By Medi Samrat  Published on  22 Nov 2023 6:14 PM IST
కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది.? : వైఎస్ షర్మిల

ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ.. ప్ర‌ధాని మోదీ కేసీఆర్ కు సాయం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ బీజేపీ ఒకే తాను ముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవు తాయని లేఖ‌లో వెల్ల‌డించారు.

సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను మీరు ఇబ్బందుల పాలు చేయడమే లక్ష్యంగా.. బీజేపీ, బీఆర్ఎస్ లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై ఎలాంటి విచారణ ఉండదు. లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు. భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? అని ప్ర‌శ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ.. ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదన్నారు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు.. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.

Next Story