రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదు : షర్మిల
YS Sharmila Slams Telangana Govt. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని
By Medi Samrat Published on 28 March 2023 2:15 PM IST
YS Sharmila
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు వైఎస్ షర్మిల అప్పీల్ చేశారు. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ లు చేస్తున్నారు.. మీరు రాష్ట్రంలో జరుగుతున్న దానిపై దృష్టి పెట్టండని కోరారు. కేసీఅర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యింది.. వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నారు.. అందుకే నన్ను ఆపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకున్నామని.. అందుకే జనతా రైడ్ కి పిలుపు నిచ్చామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని అనుకున్నామని పేర్కొన్నారు. నేడు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాలని అనుకున్నాం.. అక్కడ రోగులకు వైద్యం అందడం లేదు.. అక్కడ సమస్యలు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నాం.. నేను ఒక్క దాన్ని మాత్రమే వస్త.. దమ్ముంటే నాకు అనుమతి ఇవ్వండని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని.. మొన్న రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.. ప్రజల పక్షాన నిలబడటం తప్పా..? అని ప్రశ్నించారు. కేసీఅర్ ఒక డిక్టేటర్ అని షర్మిల విమర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద టవర్స్ కడతామని కేసీఅర్ హామీ ఇచ్చారు. రూ.200 కోట్లతో కడతాం అని చెప్పిన హామీ ఏమయ్యిందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.