బీఆర్ఎస్‌లో ఉన్న‌ ఎమ్మెల్యేలంతా 'వనమా'లే : షర్మిల

YS Sharmila Sensational Comments On BRS Mlas. బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలంద‌రూ వనమా వెంక‌టేశ్వ‌రావులేన‌ని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

By Medi Samrat  Published on  26 July 2023 4:53 PM IST
బీఆర్ఎస్‌లో ఉన్న‌ ఎమ్మెల్యేలంతా వనమాలే : షర్మిల

బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలంద‌రూ వనమా వెంక‌టేశ్వ‌రావులేన‌ని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అంద‌రూ ఎన్నికల కమీషన్ ను తప్పుదోవ పట్టించిన వాళ్లేన‌ని.. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేన‌ని ఎద్దేవా చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ల‌లో చూపింది గోరంతైతే.. దాచింది కొండంత అని ఆరోపించారు. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ష‌ర్మిల‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని.. మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు.

ఇదిలావుంటే.. తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నిక చెల్ల‌దంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువరించింది. 2018 ఎన్నిక‌ల‌లో త‌న‌పై గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో వ‌న‌మా వెంకటేశ్వరరావు తప్పుడు వివ‌రాలు ఇచ్చారంటూ జలగం వెంకట్రావు తన పిటీష‌న్‌లో పేర్కొన్నారు. జలగం వెంకట్రావు పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. సుదీర్ఘంగా విచారించిన త‌దుప‌రి వ‌నమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రెండ‌వ స్థానంలో నిలిచిన‌ జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది.





Next Story