రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం : షర్మిల
హోంగార్డు రవీందర్ చనిపోవడంపై పలువురు నేతలు స్పందిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 8 Sept 2023 3:30 PM ISTహోంగార్డు రవీందర్ చనిపోవడంపై పలువురు నేతలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్టీపీ నేత షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయింది. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా కేసీఆర్ కు.. హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం... పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం. డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు.. జీతాలు పెంచుతమని ప్రగల్భాలు పలికారు.. హోం గార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారు... హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదు.. సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం లేదు.. నీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా.. హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోండి. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం." అంటూ షర్మిల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ కన్నుమూశాడు. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ ప్రాణాలు కోల్పోయాడు. రవీందర్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతడి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. దాంతో మనస్థాపం చెందిన హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన అధికారులు రవీందర్‌ను ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన రవీందర్ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.