వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ.. లైవ్ అప్డేట్స్
YS Sharmila Political Party Updates. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని
By Medi Samrat Published on 8 July 2021 11:27 AM GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా లింక్‌ను పార్టీ యంత్రాంగం ఇప్పటికే దాదాపు పదివేల మంది వరకు షేర్ చేసినట్లు వెల్లడించింది. పార్టీకి సంబంధించి పాలపిట్ట, నీలం రంగుతో కూడిన జెండాను రూపొందించారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. షర్మిల ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. "అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమార్తె-కుమారుడుతో కలిసి దివంగత నేత సమాధి వద్ద కూర్చొని చాలా సేపు మౌనంగా ఉండిపోయారు వైఎస్ షర్మిల. తల్లి విజయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత సైతం ప్రార్దనల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచారు.
పార్టీ నేతలు ఇందిరా శోభన్, పిట్టా రాం రెడ్డి, కొండా రాఘవ రెడ్డి సైతం ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన తండ్రికి నివాళి అర్పిస్తూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. దీనిని చూసిన పార్టీ నేత కొండా రాఘవరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ కు చేరుకున్న వైఎస్ షర్మిల పంజాగుట్ట లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. మరి కొద్ది సమయంలోనే వైఎస్ షర్మిల మాట్లాడనున్నారు.