పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే..!

YS Sharmila Padayatra Short Break Due to MLC Election Code. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఆమె ఆ సమయంలో

By Medi Samrat  Published on  10 Nov 2021 11:25 AM GMT
పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే..!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఆమె ఆ సమయంలో దీక్షకు కూర్చోనున్నారు. తెలంగాణ రైతుల కోసం 72గంటల దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. ప్రభుత్వం రైతుల వడ్లు కొనాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో దీక్ష మొదలవుతుందని తెలిపారు షర్మిల. గతంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పెత్తనం ఏంటన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వడ్లు కొనం అని చెప్పడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు.

నల్గొండలో మీడియాతో మాట్లాడిన షర్మిల ఎలక్షన్ కోడ్ ఉండటంతో ప్రజాప్రస్థాన యాత్రకు విరామం ఇస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా వైఎస్‌ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. తన 21 రోజుల పాదయాత్రలో వందల సమస్యలు చూశామని షర్మిల తెలిపారు. వాటిపై ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని ఓ సర్వే చెప్పిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలోని వరి రైతులకు సంఘీభావంగా శుక్రవారం 72 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.


Next Story