సచివాలయ అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల సెటైర్లు

YS Sharmila on Telangana Secretariat Fire Accident. తెలంగాణ నూతన సచివాలయంలో దట్టమైన పొగలు వెలువడడంతో అగ్నిప్రమాదం సంభవించినట్

By Medi Samrat  Published on  3 Feb 2023 3:45 PM GMT
సచివాలయ అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల సెటైర్లు

తెలంగాణ నూతన సచివాలయంలో దట్టమైన పొగలు వెలువడడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం మాట్లాడారు. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు.

నూతన సచివాలయంలో మాక్ డ్రిల్ చేపట్టామని అధికారులు అంటుండడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రూ.1,100 కోట్లతో నిర్మించిన సచివాలయంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని బయటపడిందని.. దొరగారు ఏది కట్టినా పైన పటారం లోన లొటారం అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రమాదం ఎందుకు జరిగిందన్నది అన్వేషించాల్సింది పోయి, మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని షర్మిల స్పష్టం చేశారు. ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.


Next Story