షర్మిల పార్టీ కార్యాలయం ఎక్కడ.? ఊహాగానాలు నిజ‌మ‌య్యేనా..?

YS Sharmila New Party News. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవత‌రించ‌బోతున్న విషయం తెలిసిందే. పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలని వైఎస్‌ షర్మిల సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on  11 Feb 2021 2:54 PM GMT
YS Sharmila New Party News

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవత‌రించ‌బోతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల కిందట వైఎస్‌ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే తాను పెట్టబోయే పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలని వైఎస్‌ షర్మిల సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిసి వచ్చిన లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లో నుంచే పార్టీ వ్యవహారాలు నడపాలని పలువురు నేతలు షర్మిలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా గచ్చిబౌలిలో కార్యాలయం పెట్టాలని అనుకున్న షర్మిల.. జిల్లా నేతలకు దూరం అవుతుందనే భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ విధానాలు తయారు చేసేందుకు రాజకీయ మేధావులతో భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పలువురు రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, అధికారులతో చర్చించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఎక్కడ వైఎస్‌ఆర్‌ సీపీ ఆనవాళ్లు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో పార్టీ పెట్టనున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్న‌ ఆలోచనతో పార్టీ పెట్టబోతున్నట్లు చెబుతున్న నేప‌థ్యంలో ఈ పేరు క‌రెక్ట‌నే ఊహాగానాలు విన‌ప‌డుతున్నాయి.

అంతేకాక‌ వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా వార్తలు వ‌స్తున్నాయి. లేక‌పోతే.. వైఎస్‌ఆర్‌, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరును ఖరారు చేయనున్నారట‌. రానున్న 30 రోజుల్లో షర్మిల పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. తర్వాత పార్టీ ప్రకటన.. దాని కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆమె ముందుగా వైఎస్‌ఆర్‌ అభిమానులతో జిల్లాల‌లో 30 రోజులు భేటీ కానున్నట్లు సమాచారం.




Next Story