వివేకానంద రెడ్డి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila Key Comments On Vivekananda Reddy Murder Case. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  21 Oct 2022 12:58 PM GMT
వివేకానంద రెడ్డి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ ని ఎవరు హతమార్చారో .. ఎందుకు హతమార్చారు బయటకు రావాలని వైయస్ షర్మిల చెప్పుకొచ్చారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తమ కుటుంబం లో జరిగిన ఘోరమైన ఘటన అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తన చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో, వారికి శిక్ష పడాలని.. తన సోదరి సునీతకు న్యాయం జరగాలని వైయస్ షర్మిల ఆకాంక్షించారు. దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొన్న షర్మిల, దర్యాప్తును సుప్రీం కోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదలాయించాలని వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి చేసిన డిమాండ్ కు సిబీఐ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఈ ఏడాది ఆగస్టు 12న వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రంలో విచారణ నిర్వహించాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది.


Next Story
Share it