Telangana: మహిళల మిస్సింగ్‌పై వైఎస్ షర్మిల ఏమన్నారంటే.!

దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్‌ గణంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు వెల్లడించింది.

By అంజి  Published on  28 July 2023 7:35 AM IST
YS Sharmila, womens missing, Telangana, KCR

Telangana: మహిళల మిస్సింగ్‌పై వైఎస్ షర్మిల ఏమన్నారంటే.!

దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్‌ గణంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు వెల్లడించింది. ఇప్పటికే ఏపీలో మహిళల అక్రమ రవాణాపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటు తెలంగాణలో మిస్సైన మహిళలు, బాలికల గణంకాలపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందన్నారు. కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదన్నట్టు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్ లో నిద్ర పోతున్నాడని మండిపడ్డారు. రెండేళ్లలో 34,495 మంది మహిళలు, 8,066 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే.. కేసీఆర్ తలదించుకోవాలన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు సిగ్గుపడాలని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆడవారి పట్ల వివక్ష చూపే ఈ బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు సున్నా అని అన్నారు. కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదని షర్మిల వ్యాఖ్యానించారు.

దేశంలోనే నం.1 అని చెప్పే పోలీసింగ్ వ్యవస్థ.. మహిళలు మాయం అవుతుంటే దొరకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతుందన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో..1% కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదన్నారు. దొరకు ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా..వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తక్షణం తప్పిపోయిన మహిళలు,బాలికల ఆచూకీ కనిపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story