ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని.. తన పాదయాత్రతో కేసీఆర్ కు వణుకు పుడుతోందన్నారు. తెలంగాణలో మిగతా పార్టీల నేతల పాదయాత్రలకు అనుమతిస్తూ.. తన పాదయాత్రకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మహిళా నేతలు లిక్కర్ స్కాంలో ఉంటే తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని షర్మిల అన్నారు. కేసీఆర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికు ఉన్న ఆదరణ చూస్తే భయం వేస్తోందన్నారు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా తన పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని.. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో తనను పోలీసులు ఎందుకు రిమాండ్ కోరారని ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలకు దిగింది తాను కాదని షర్మిల అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, నేతల అవినీతిని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. మంత్రి హోదాలో ఉండి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని గుర్తు చేశారు.