మనిషివేనని నిరూపించుకోమంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల
YS Sharmila Fires On CM KCR. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Aug 2021 10:15 AM GMT'ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్.. టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పెనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను .. సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్.. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పుడు.. ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు.. పరిపాలన చేయడం చేతకానప్పుడు .. మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్' అని ఆమె విమర్శించారు.
రాజన్న బిడ్డ వచ్చింది... మేమంతా వచ్చాం.. వైయస్సార్ తెలంగాణ పార్టీ వచ్చింది... మేం ప్రశ్నిస్తాం... ఇక నీ ఆటలు సాగవని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల పక్షాన తాము పోరాడతామని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్ కు మనసు రావడం లేదని షర్మిల అన్నారు. అయ్యా కేసీఆర్ గారూ... మీరు అనవసరంగా వృథా చేస్తున్న సొమ్ముతో షబ్బీర్ లాంటి ఆత్మహత్యలు చేసుకున్న ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు అని చెప్పారు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చేతకాదని మండిపడ్డారు. ఉపఎన్నికలు వస్తే మాత్రం గెలిచేందుకు అడ్డగోలుగా వేల కోట్లు ఖర్చు పెడతారని విమర్శించారు.