సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన షర్మిల
YS Sharmila Fires On CM KCR. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ
By Medi Samrat Published on 9 April 2021 9:28 PM ISTదివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే ఆమె ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ వేదికగా సంకల్ప సభ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సాయంత్రం భారీ అభిమాన సందోహం మధ్య షర్మిల, ఆమె తల్లి విజయమ్మ సభావేదిక దగ్గరికి వచ్చారు.
సభకు ముఖ్య అతిధిగా వచ్చిన విజయమ్మ మాట్లాడుతూ.. తన భర్తను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 18 ఏళ్ల కిందట ఇదే రోజున తెలంగాణలో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. షర్మిల రాజకీయ ప్రస్థానం ఖమ్మం నుండి మొదలవడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం మాట్లాడిన షర్మిల.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో పాలక పక్షాన్ని ప్రశ్నించడానికి నూతన పార్టీ అవసరమన్నారు. తెలంగాణ ప్రజానీకానికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఇక్కడ దొరల పాలన జరుగుతుందని.. దొర నీ బాంచన్.. అన్న వాళ్లకే రాజకీయ భవిష్యత్ అని విమర్శలు గుప్పించారు.
ఎవరు అవునన్నా కాదన్న.. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నేను తెలంగాణ బిడ్డనే అని ఆవేశంగా మాట్లాడారు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చదివాను. బరాబర్.. ఇక్కడి ప్రజల కోసం నిలబడతానని.. నేను పెట్టబోయే ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం మనసా.. వాచా.. కర్మణా నిలబడుతుందని వ్యాఖ్యానించారు. రాజన్న దీవెన, దేవునిపై నమ్మకం తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయిస్తాయని అన్నారు. జులై 8న కొత్త పార్టీ అవిష్కరణ ఉంటుందని స్పష్టం చేశారు.