కేటీఆర్ కు వైఎస్ షర్మిల భారీ కౌంటర్లు

YS Sharmila Fire On Minister KTR. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేపగా

By Medi Samrat  Published on  30 April 2022 8:42 AM GMT
కేటీఆర్ కు వైఎస్ షర్మిల భారీ కౌంటర్లు

తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేపగా.. ఆ తర్వాత ట్విట్టర్ లో అందుకు సంబంధించిన వివరణ ఇచ్చారు. క్రెడాయ్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే బాధ కలిగించి ఉండొచ్చంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఎవరినో బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. ఏపీ సీఎం జగన్‌ ను సోదర సమానుడిగా భావిస్తున్నానని.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్​ ట్వీట్ ద్వారా తెలిపారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ వేశారు. మ‌న‌మే స‌రిగ్గా లేన‌ప్పుడు ప‌క్క వారి మీద ప‌డి ఏడిస్తే ఏం లాభ‌మని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని.. కేటీఆర్ కు తెలంగాణలో సమస్యలు నీకు కనిపించలేదా? అని ఆమె ప్ర‌శ్నించారు. తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే ప్రజల సమస్యలు తెలిసేవని అన్నారు. ఆంధ్ర‌లోనే చిన్న దొర కేటీఆర్‌కు ఫ్రెండ్స్ ఉన్నార‌ట అని ఆమె ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏం సంతోషంగా ఉన్నార‌ని షర్మిల ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Next Story
Share it