టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకుల్లో సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పటిదాకా 19మందిని అరెస్ట్ చేశామని చెప్తున్న సిట్.. పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతూ సూత్రధారులకు క్లీన్ చీట్ ఇచ్చే పనిలో పడిందని ఆరోపించారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే సాగుతున్న దర్యాప్తులో తెరవెనుక ఉన్న అసలు దొంగలను దాచిపెడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. పేపర్ లీకులు దేశాలు దాటిపోయినా పట్టింపు లేదని విమర్శలు గుప్పించారు. బోర్డ్ సభ్యుల్లో ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదని.. కనీసం కాన్ఫిడెన్షియల్ అధికారిని కూడా బాధ్యతల నుంచి తప్పించలేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు ముగిసే వరకు బోర్డ్ సభ్యులపై కనీసం నిఘా పెట్టలేదన్నారు. పేపర్ లీకుల్లో కేవలం ఉద్యోగులు మాత్రమే ఉంటే సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్ అండ్ బ్యాచ్ కి భయమెందుకు? అని ప్రశ్నించారు. సీబీఐ పేరు చెప్తేనే వణుకు పుడుతుందంటే.. అసలు దొంగలు ప్రగతి భవన్ లోనే ఉన్నట్లా? అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుత బోర్డ్ ను తక్షణం రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.