విశాఖ ఉక్కు కాదు.. నిజాం షుగర్స్ సంగతి ఏంటి..? : వైఎస్‌ షర్మిల

YS Sharmila Fire On CM KCR. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఅర్ పై వైఎస్సాఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  4 Jan 2023 7:55 AM IST
విశాఖ ఉక్కు కాదు.. నిజాం షుగర్స్ సంగతి ఏంటి..? : వైఎస్‌ షర్మిల

ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఅర్ పై వైఎస్సాఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసినప్పటికీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాతియీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ష‌ర్మిల విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. విశాఖ ఉక్కు ను కాపాడటం కాదు దొర.. నీ హయాంలో మూతపడిన నిజాం షుగర్స్ సంగతి ఏంటి..? ప్ర‌శ్నించారు.

మహోజ్వల భారత్ కాదు దొర.. ముందు మహోజ్వల తెలంగాణ అయిందా? అని నిల‌దీశారు. దళితులకు మూడెకరాల భూమి అందిందా? రైతులకు రుణమాఫీ అయిందా? పంట పరిహారం అందిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారా? పోడు పట్టాలు ఇచ్చారా? గొల్లకురుమలకు గొర్లు వచ్చాయా? ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారా? అని ప్ర‌శ్న‌లు సంధించారు. మీ ఉజ్వల పాలనలో.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం లేదని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం లేదు.. కౌలు రైతుకు దిక్కు లేదు.. యువతకు కొలువుల్లేవు.. అర్హులకు స్వయం ఉపాధి లేదు.. కార్మికులకు భరోసా లేదు..మహిళలకు రక్షణా లేదు. మీది ఉజ్వల పాలన కాదు! అవినీతి పాలన.. అక్రమాల పాలన, దౌర్జన్యాల పాలన.. నిర్బంధాల పాలన.. అరెస్టుల పాలన.. గూండాల పాలన అంటూ తీవ్ర‌విమ‌ర్శ‌లు చేశారు.

తెలంగాణలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలకు దిక్కులేదు.. కానీ విశాఖ ఉక్కును కాపాడుతాడట అని ఎద్దేవా చేశారు. 'ఓట్ల కోసమే పథకాలు పెడుతున్నం' అని కరాఖండిగా చెప్పిన నీ నోట.. 'ఏం చేసినా ఎన్నికల కోసమేనా?' అనే మాట రావడం దయ్యాలకు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. మునుగోడులో వేల కోట్లు కుమ్మరించి, ప్రజలను ప్రలోభపెట్టి, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు దత్తతల పేరుతో దగా చేసి, ఓట్లు దండుకున్న నీకు.. ఎన్నికల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. మోదీ దేశాన్ని పట్టపగలే అమ్ముతుంటే.. మీరు పట్టపగలే తెలంగాణ సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. జనం మీద అప్పులు పెట్టి, మీ ఖజానా నింపుకుంటున్నారని అన్నారు.



Next Story