మేం పాదయాత్ర చేస్తే కేసీఆర్ కు వచ్చిన నష్టమేంటి.? : షర్మిల
YS Sharmila Fire On CM KCR. ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్
By Medi Samrat Published on 9 Dec 2022 10:27 AM GMTప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైయస్సార్టీపీ అధినేత్రి షర్మిల వినతిపత్రం ఇచ్చి ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు. బేడీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి.. ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి చేస్తున్న యజ్ఞం అని పేర్కొన్నారు. మేం అడుగడుగునా శాంతియుతంగా పాదయాత్ర చేశాం. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించలేదు. 3500 కి.మీ. దాటిన తర్వాత టీఆర్ఎస్ గూండాలే మాపై దాడి చేశారని తెలిపారు.
మా పార్టీ వల్ల కేసీఆర్ పాలనకు ప్రమాదం అని తెలిసి పాదయాత్రను ఆపడానికి కుట్ర పన్నారని.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేశారు.. పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వడం లేదు.. కేసీఆర్ గారు న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తున్నారని అన్నారు. మేం పాదయాత్ర చేస్తే కేసీఆర్ కు వచ్చిన నష్టమేంటి? వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ కు భయం లేకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి? అని డిమాండ్ చేశారు.
అడుగడుగునా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.. ఒకేసారి పాదయాత్ర ఆపాలన్న కుట్ర ఎందుకు చేస్తున్నారు? వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ కు భయం అని అర్థమవుతుంది. మీరు హామీ ఇచ్చిన రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, మైనార్టీల 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదు. అవి మేం ప్రశ్నిస్తే మాపై దాడులా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఒక రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. నర్సంపేట్ లో టీఆర్ఎస్ నేతలు మా బస్సు తగలబెట్టి, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెడితే, ఫ్లెక్సీలు నాశనం చేస్తే, పెట్రోల్ దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేసి మమ్మల్ని, మా వాళ్లను గాయపరిచి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తే వారిపై ఎలాంటి చర్యలు లేవు. బాధితులు మేమైతే, మమ్మల్నే అరెస్ట్ చేశారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా మేం ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. ఎవరిని కించపరచలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎత్తి చూపాం అని అన్నారు.
చాలారోజులు పాదయాత్ర సజావుగా సాగింది. మా పార్టీ నాయకులపై దాడులు చేసినా సంయమనం పాటించారు. ఎక్కడా కూడా గొడవకు దారి తీయలేదు. కేసీఆరే పని గట్టుకుని మా పాదయాత్రపై కుట్ర చేశారు. పోలీసులను జీతగాళ్లలా, పనోళ్లలా, టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకొని మమ్మల్ని అరెస్ట్ చేయించారని విమర్శించారు. బెయిల్ పై బయటకు రాకుండా రిమాండ్ లో పెట్టే ప్రయత్నం చేశారు, ఇప్పుడు పాదయాత్రకు అనుమతే రాకుండా చేశారని ఫైర్ అయ్యారు.
ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ను ప్రశ్నించకపోవడం వల్లే.. ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. మేం పార్టీ స్థాపించాక ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం, కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతున్నాం, నెరవేర్చని హామీలపై ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని శిఖండి అని తిట్టినా, మరదలు అని హేళన చేసినా, వ్రతాలు అని కించపరిచినా, తొక్కుతాం అని హెచ్చరించినా మౌనంతో ఉన్నామని అన్నారు. టీఆర్ఎస్ నేతలే వ్యక్తిగత దూషణలకు పాల్పడి, మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.
ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే.. అవి రెచ్చగొట్టే వ్యాఖ్యాలా? కేసీఆర్ కు దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. మేం కూడా వస్తాం. మీరు కూడా రండి. మీరు ఇచ్చిన హామీలపై, ప్రజా సమస్యలపై బహిరంగంగా చర్చిద్దాం అంటూ సవాల్ విసిరారు. అవినీతి ఎత్తిచూపితే గులాబీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఎనిమిదేండ్లుగా ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేశారు.. బెదిరించారు.. భయపెట్టారు.. కొనేశారని ఆరోపించారు. ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవం. ఒక్క రోజు మాతో పాదయాత్ర చేయండని ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపండి, ప్రజలకు సమస్యలు లేకపోతే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతాను. సమస్యలుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని చాలెంజ్ చేశాం. నిజంగానే దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఎందుకు ఛాలెంజ్ స్వీకరించలేదు. ఒక్కరోజు కూడా ప్రజల కోసం పని చేసింది లేదు.. ప్రజల సమస్యలు కనుక్కున్నది లేదు.. పాలకులు రాజకీయాల కోసం, స్వార్థం కోసమే పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.