"రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరిందంటూ" మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. చందమామను చూసి కుక్కలు మొరగడం సహజమని, కుక్కలకు కుక్క బుద్ది ఎక్కడికి పోతుందని ఆమె అన్నారు. ఈ రోజు సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మంత్రికి భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ కుక్కకి కవితగారు ఏమైతారో మీరు అడగండి నిలదీశారు. మేం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే.. మీరు హేళన చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందని అన్నారు. ప్రతి మంగళవారం రోజున ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలనుద్దేశించి మంగళవారం మరదలు బయల్దేరిందంటూ కామెంట్ చేశారు. 'రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది'' అంటూ వ్యాఖ్యానించారు. ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు.