ప్రతి ఒక్కరి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరాలి : షర్మిల
YS Sharmila Addresses The Meeting. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నేడు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల
By Medi Samrat Published on 21 Feb 2022 2:00 PM GMTవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నేడు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల మండల స్థాయి, జిల్లా స్థాయి కో ఆర్డినేటర్లతో పార్టీ రాష్ట్ర కార్యాలయం లోటస్‌పాండ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. వైయస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాను. ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. కానీ ఇది నేను ఒక్కదాన్ని చేసే పని కాదు.. ఒక్క దాన్ని అనుకుంటే అయ్యే పని కాదు.. నాకు బలం కావాలి, బలగం కావాలి. మనందరం కలిసి చేయి చేయి కలిపి చిత్తశుద్ధితో, మంచి మనసుతో పని చేస్తే వైయస్ రాజశేఖర్‌రెడ్డి సుపరిపాలన రాష్ట్రంలో మళ్లీ తీసుకురావడం సాధ్యమవుతుందని దిశానిర్దేశం చేశారు.
మీరందరూ మా కుటుంబానికి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్లు, మరి కొందరు గత సంవత్సర కాలంగా మాతో కలిసి ప్రయాణం చేసిన వారు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇంకా ఎదగాలి. మన పార్టీ గ్రామగ్రామాన విస్తరించాలి.. అప్పుడే మనం అధికారంలోకి రాగలుగుతాం. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలి. వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరాలి. ప్రతి పోలింగ్‌బూత్‌కు చిత్తశుద్ధితో పనిచేసే పదిహేను మంది కార్యకర్తలను తయారు చేసుకున్నప్పుడే మనం ఎన్నికలకు సిద్ధం అయినట్టు. ఇదే మన ముందున్న లక్ష్యం. వైయస్ఆర్ సంక్షేమ పాలన సాధించడంలో మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నానని షర్మిల వ్యాఖ్యానించారు.