అన్న హత్యకు కుట్ర.. కోటి రూపాయలు డీల్.. చివరికి ఏమైందంటే..

younger brother who conspired to murder Elder Brother. ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత అన్నను చంపించాలనుకున్నాడు ఓ తమ్ముడు.

By Medi Samrat  Published on  23 July 2022 1:50 PM GMT
అన్న హత్యకు కుట్ర.. కోటి రూపాయలు డీల్.. చివరికి ఏమైందంటే..

ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత అన్నను చంపించాలనుకున్నాడు ఓ తమ్ముడు. హత్య కోసం ఏకంగా కోటి రూపాయలు, ఎకరం భూమి సుపారీగా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి ఈ విషయాన్ని తన అన్నకు చెబుతున్నాడనే అనుమానం వచ్చి అతణ్ని కూడా చంపించాడు. హంతకుడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం కుట్ర బయటపడింది.

అన్న హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి.. వికారాబాద్‌ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్నారు భద్రునాయక్‌. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీకి చెందిన బాణోతు వీరునాయక్‌, భద్రునాయక్‌ అన్నదమ్ములు. తమ్ముడు భద్రునాయక్‌ వికారాబాద్‌ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి స్వగ్రామంలో 120 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ నగరంలో ప్లాట్లు, ఇళ్లు, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బొప్పారం గ్రామశివారులో 12 ఎకరాల భూమి, రెండెకరాల గ్రానైట్‌ క్వారీ, చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలో రెండెకరాల గ్రానైట్‌ క్వారీని కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. బొప్పారం క్వారీలో భద్రునాయక్‌ తన బంధువైన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండాకు చెందిన లునావత్‌ హరీశ్‌ను సూపర్‌వైజర్‌గా నియమించుకున్నాడు. ఏసీబీకి పట్టిస్తాననడంతో..మొత్తం ఆస్తిలో తనకు సమాన వాటా ఇవ్వాలంటూ కొంతకాలంగా వీరునాయక్‌ తన తమ్ముడు భద్రూనాయక్‌ను కోరుతున్నాడు. కానీ, ఇందుకు భద్రునాయక్‌ అంగీకరించకపోవడంతో ఉద్యోగంలో అక్రమంగా సంపాదించిన విషయాన్ని ఏసీబీకి చెబుతానని బెదిరించాడు. దీంతో అన్నపై తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో క్వారీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న హరీశ్‌ను వీరునాయక్‌ విధుల నుంచి తొలగించాడు. దీంతో భద్రునాయక్‌ హరీశ్‌ను సంప్రదించి తన అన్నను చంపితే రూ.కోటి, ఎకరం భూమి ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. హరీశ్‌ తన స్నేహితులైన సూర్యాపేటకు చెందిన జక్కి సతీష్‌, గంట పరశురాములు, విజయ్‌భరత్‌, రియాజ్‌, రాజానాయక్‌తండాకు చెందిన సంపంగి ప్రవీణ్‌లకు ఈ విషయం చెప్పి ఒప్పించాడు.

అందరూ కలిసి జూన్‌ 20న ఖమ్మం వెళ్లారు. అయితే అక్కడ అతని ఆచూకీ తెలుసుకోలేక తిరిగి వచ్చారు. జూన్‌ 30న మరోసారి ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం మండలంలోని కాకరవాయి, జూపెడ మధ్య వీరునాయక్‌ కారును వేరే కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి చంపే ప్రయత్నం చేశారు. అయితే తన వెంట ముగ్గురు వ్యక్తులు ఉండటంతో ప్రతిఘటించిన వీరునాయక్‌ తప్పించుకున్నాడు. హత్య కుట్రను సుపారీ గ్యాంగ్‌లో ఉన్న సంపంగి ప్రవీణ్‌.. వీరునాయక్‌కు లీక్‌ చేస్తున్నాడని హరీశ్‌ అనుమానించాడు. భద్రునాయక్‌ ముందుగా ప్రవీణ్‌ని చంపాలని హరీశ్‌కు సూచించాడు. దీంతో ఈ నెల 13న ప్రవీణ్‌ ఇంటికి వెళ్లిన హరీశ్‌ నెమ్మికల్‌లో పార్టీ ఉందని తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ మద్యం తాగి సూర్యాపేటలోని జక్కి సతీష్‌ సోదరుడు హరికృష్ణ గదికి వెళ్లారు. అక్కడే సతీష్‌, హరీశ్‌ కలిసి ప్రవీణ్‌ మెడకు బెల్టుతో గట్టిగా బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామశివారులోకి తీసుకెళ్లి తలపై బండరాళ్లతో మోదారు. మృతదేహాన్ని వీడియోకాల్‌ ద్వారా భద్రునాయక్‌కు చూపించారు. భద్రునాయక్‌ రూ.20 వేలను తన కుమారుడి అకౌంట్‌ నుంచి హరీశ్‌కు పంపించాడు. హత్య గురించి పోలీసులు ఎంక్వయిరీ చేయగా హరీశ్‌.. పోలీసులకు చిక్కాడు. మొత్తం కుట్రను బయటపెట్టాడు. దీంతో శుక్రవారం భద్రునాయక్‌ సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.


Next Story
Share it