సూర్యాపేట శివారులో మూసీ కాల్వకట్టపై మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(మాల బంటి) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆరు నెలల క్రితం కృష్ణతో వివాహమైందని అతని భార్య భార్గవి తెలిపింది. తన భర్తను హత్య చేశారని, న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వడ్లకొండ కృష్ణను కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు. మృతదేహాన్ని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై విసిరేశారు. బాధితుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కృష్ణ 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కృష్ణ కులాంతర వివాహమే ఈ హత్యకు కారణమా అని అనుమానిస్తున్నారు. లేక పాతకక్షలే కృష్ణ హత్య కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.