హంగ్ వచ్చే అవకాశమే లేదు.. కాంగ్రెస్ దే ఘన విజయం: యోగేంద్ర యాదవ్
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 8:15 AM ISTహంగ్ వచ్చే అవకాశమే లేదు.. కాంగ్రెస్ దే ఘన విజయం: యోగేంద్ర యాదవ్
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సృష్టించేది కేవలం వేవ్ మాత్రమే కాదు. తుఫాను రాబోతోంది" అని సైఫాలజిస్ట్, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పర్యటించిన యోగేంద్ర యాదవ్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారని స్పష్టంగా తెలిపారు.
“అసెంబ్లీ ఫలితాలలో హంగ్ అంటూ ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉంది. తప్పకుండా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎన్నుకోబోతున్నారు. డబ్బు ప్రతిసారీ పని చేయదని తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించబోతున్నారు” అని రాష్ట్ర సమగ్ర పర్యటన తర్వాత హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో యోగేంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని యాదవ్ సూచించారు.
ఓట్ల కోసం దేనికైనా తెగించబోతున్నారు:
డబ్బు, మద్యంతో గెలిపించుకోవాలని అనుకునే వారికి ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెబుతాయని యోగేంద్ర యాదవ్ అన్నారు. డబ్బుతో ఓట్లను కొనలేరు.. పార్టీలను గెలిపించుకోలేరని అన్నారు. "భారత రాష్ట్ర సమితికి ఓటు వేస్తే బీజేపీ బలపడుతుందని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది వారికి స్పష్టంగా అర్థమైంది,” అని యోగేంద్ర యాదవ్ చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ ను ఇందుకే ప్రజలు అసహ్యించుకుంటున్నారు:
నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది.. ఇది యువతలో అసంతృప్తికి కారణమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. “రైతు బంధు వంటి పథకాలు తక్కువ భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాల కంటే భూస్వాములకు మరింత ప్రయోజనకరంగా ఉన్నాయి. దళిత బంధు అణగారిన వర్గాలకు ప్రయోజనాల కోసం తీసుకుని వచ్చినట్లు చెప్పినా.. ఇందులో కూడా రాజకీయాలు చేశారు. చాలా పేద కుటుంబాలకు దళితబంధు అందకపోవడంతో వారికి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం ఏమిటో తెలిసింది.” అని ఆయన అన్నారు. యోగేంద్ర యాదవ్‌తో పాటు తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన కిరణ్ విస్సా మాట్లాడుతూ, “దళిత బంధు పొందిన వారు కూడా సంతోషంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన రూ.10 లక్షల విడుదలకు రూ.2 లక్షలు లంచంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది ప్రజలలో కోపానికి కారణమైంది. ” అని అన్నారు.
అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయి:
హైదరాబాద్ అభివృద్ధిని చూస్తోందని అంటున్నారు. అయితే ఆ అభివృద్ధి కేవలం హైటెక్ సిటీ వైపు మాత్రమే ఉందని విస్సా అన్నారు. “గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి, కాని వారు నగరంలోని మురికివాడల్లోనే ఉంటున్నారు. ఒక వైపు నగరంలోని ఒక భాగం చాలా అభివృద్ధి చెందింది. మరొక వైపు ప్రాథమిక మౌలిక సదుపాయాలను సృష్టించడం, నిర్వహించడం కూడా ఒక సవాలుగా మిగిలిపోయింది. ఈ వ్యత్యాసాలు, అసంతృప్తి మార్పు కోసం డిమాండ్‌కు దారితీశాయని ఆయన అన్నారు.
ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం:
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి విస్సా మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్రానికి నోడల్ సెంటర్ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మాత్రమే అని, దీని వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. “రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చింది. వైద్యంలో ఆలస్యం, ఆసుపత్రిలో పడకలు లేకపోవడం వల్ల ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆ దశను ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావిస్తున్నారు, ”అని ఆయన అన్నారు.
బీజేపీకి తలుపులు తెరచుకోబోతున్నాయా:
దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించాలని.. తెలంగాణను ప్రవేశ ద్వారంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందని.. అయితే డిసెంబర్ 3న ఆ తలుపు మూసుకుపోతుందని యోగేంద్ర యాదవ్ అన్నారు. “నేను రాజకీయ నాయకుడిగా ఈ ప్రకటన చేస్తున్నాను.. నేను మళ్ళీ హైదరాబాద్ కు వస్తాను. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు మూడ్ ను సెట్ చేస్తాయి. కాంగ్రెస్‌కు ఘనవిజయం దక్కుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. వేవ్ వచ్చే సమయంలో చాలా మంది ఆ విషయాన్ని గుర్తించలేరు.. గుర్తించినా బయటకు చెప్పుకోలేరు” అని ఆయన అన్నారు. భారత్ జోడో అభియాన్‌లో భాగమైన వివిధ సివిల్ సొసైటీ సంస్థల నుండి వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్‌ల ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని యాదవ్ చెప్పారు.