అకాల వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన యాదగిరిగుట్ట

Yadagirigutta Ghat Road Damaged Due To Heavy Rain. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి

By Medi Samrat
Published on : 4 May 2022 4:04 PM IST

అకాల వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన యాదగిరిగుట్ట

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ఆలయానికి భక్తులు వెళ్లే ఘాట్ రోడ్డు దెబ్బతింది. అకాల వర్షం కారణంగా యాదగిరిగుట్ట అస్తవ్యస్తంగా మారింది. వర్షం ధాటికి కాంట్రాక్ట‌ర్ల‌ నాసికరం పనులు బయటపడ్డాయి. దీంతో ఆలయంలోకి వెళ్లే వాహనాలు, బయటకు వెళ్లే వారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ‌ర్షం ధాటికి ఆలయ కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు కుంగి కోతకు గురయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్ద రింగ్ రోడ్ చెరువును తలపిస్తుంది. కొండపైకి ఎక్కే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో బస్సులు దిగ‌బ‌డ్డాయి. ఈదురుగాలులకు కొండపైన చలువ పందిళ్ళు కుప్పకూలాయి.

క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలోకి వర్షపు నీరు చేరింది. ఇది క్యూలో నిలబడి ఉన్న ప్రజలకు అసౌకర్యాన్ని క‌లిగించింది. ఆలయ సముదాయం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఆలయ అధికారులను మీడియా ప్రశ్నించగా.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తామని, ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే రోడ్డు వేసిన కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నారన‌డానికి ఈ ఘటనే నిదర్శనం అని భ‌క్తులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.











Next Story