యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు కీలక సూచన. భక్తులు జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. అయితే సాధారణ క్యూలో దర్శనం కోసం వచ్చే వారికి ఈ నిబంధన మినహాయింపు ఇచ్చారు. ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, సుదర్శన నరసింహ హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, వీఐపీ దర్శనం కోసం భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. దేవాలయం పవిత్రతను కాపాడే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నో ప్రముఖ ఆలయాల్లో డ్రెస్ కోడ్ వాడుకలో ఉంది.
మహిళలు చీర లేదా చున్నీతో చుడీదార్ ధరించవచ్చు. మగవాళ్ళు ధోతీ లేదా తెల్లని లుంగీ, ఉత్తరీయం ధరించాలి. షార్ట్‌లు, జీన్స్, టీ షర్టులు, స్కర్ట్‌లు, మోడ్రన్ డ్రెస్‌లు ధరించిన వారిని ఆలయంలోకి అనుమతించరు. మోడల్ గా ఆలయ ఉద్యోగులు గత రెండు నెలలుగా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. ఇక కొండ పై ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంటుందని, భక్తులు పర్యావరణహిత బ్యాగులను మాత్రమే వినియోగించాలని అధికారులు కోరారు.