రేపటి నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి నిర్వహించబోయే కార్యక్రమాలను ఆలయ ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపద్యంలో ఈనెల 21వ తేదీ నుండి మూడవ తేదీ వరకు ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి వారి తిరుకల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.