తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు

తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు

By -  Knakam Karthik
Published on : 22 Jan 2026 2:44 PM IST

Telangana, Cm Revanth, Congress Government, Davos Tour, World Economic Forum, Telangana Rising 2047 Vision

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో జరిగే దావోస్ లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో అప్ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్, లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్‌లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. తెలంగాణ ఆర్థిక వృద్ది ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్కిల్ డెవెలప్మెంట్, స్పోర్ట్స్కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన C4IR తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్‌ అదేనని గుర్తు చేశారు. C4IR ఆదర్శవంతమైన మోడల్గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై C4IR చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Next Story