కుటుంబ సమేతంగా సెల్ఫీలు దిగుతూ ఉండగా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడి ఓ మహిళ కొనప్రాణాలతో బయటపడింది. ఆమె పడగానే అక్కడ ఉన్న స్థానికులు వేగంగా స్పందించారు. ఆమెను సురక్షితంగా తరలించడంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఓ కుటుంబం నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ వద్ద ఆగింది. గత కొన్ని వారాలుగా కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా ఇన్ ఫ్లో రావడంతో శుక్రవారం డ్యాం గేట్లను తెరిచారు.
వేములపల్లి బ్రిడ్జిపై కాల్వ దగ్గర కుటుంబంతో కలిసి సెల్ఫీలు దిగుతుండగా ఆ కుటుంబంలోని ఓ మహిళ కాలువలో పడిపోయింది. అదృష్టవశాత్తూ దీన్ని గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగి, తాడుతో మహిళను కాలువ నుండి సురక్షితంగా బయటకు తీశారు. స్థానికులు కొందరు వెంటనే కాలువలోకి దూకి ఆమెను కాలువ ప్రహరీ గోడ వద్దకు తీసుకొచ్చారు. స్థానికులు తాడుతో మహిళను వంతెనపైకి తీసుకొచ్చారు. ఆమెకు ఏమీ అవ్వకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.