తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేరు పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తహశీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టు కట్టి నిరసన వ్యక్తం చేసింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాణాల గ్రామంలో నివాసముంటున్న మంగ అనే మహిళకు చెందిన భూమిని తహశీల్దార్ వేరేవాళ్ల పేరిట రిజిస్టర్ చేశారని ఆరోపిస్తూ మహిళ ఆందోళనకు దిగింది.
ఈ విషయమై ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని.. తక్షణమే తమ పేరు మీదకి భూమిని బదలాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్వోను అడిగితే.. ఫీల్డ్ అసిస్టెంట్ అంటున్నారు.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగితే.. వీఆర్వో అంటున్నారు అంటూ పట్టించుకోవడం లేదని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ఊరులోనే నర్సు పనిచేసుకుంటూ బతుకున్నానని.. పిల్లలు ఉన్నారని.. తమకు చెందిన భూమిని తమ ప్రమేయం లేకుండా వేరే వాళ్ల పేరిట ఎలా రాస్తారని.. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయమై అధికారులు స్పందించాల్సివుంది.