సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తమదైన శైలిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తుంటారు. ఈ క్రమంలోనే బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని, లేకపోతే జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న బైక్ వెనుకాల కూర్చున్న ఓ మహిళ.. తన తలకు ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుంది. దీంతో వారిని ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి.. ట్విటర్‌లో పెట్టారు.
"హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు... హెల్మెట్ పెట్టుకోండి.. సురక్షితంగా ఉండండి" అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. నగరంలో బైక్ నడిపే వక్తితో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మోటార్ వెహికల్ చట్టం 1989 ప్రకారం.. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే రూ.100 జరిమానా విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయిన రూ.100 జరిమానా విధిస్తున్నారు.