మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌ : 19, 20వ తేదీల్లో మ‌ద్యం దుకాణాలు బంద్

Wines Bundh In September 19th, 20th. హైద‌రాబాద్‌లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మ‌ద్యం దుకాణాలు

By Medi Samrat  Published on  18 Sep 2021 10:31 AM GMT
మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌ : 19, 20వ తేదీల్లో మ‌ద్యం దుకాణాలు బంద్

హైద‌రాబాద్‌లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మ‌ద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో వైన్స్, బార్లు, ప‌బ్‌లు మూసి ఉంటాయ‌ని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి 20న సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, బార్లు, ప‌బ్‌లను మూసి ఉంచ‌నున్నారు.

గ్రేటర్‌లో జరుగనున్న గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటించారు. గణేశ్‌ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు.

ఇక 19న గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అధికారులు ప్రకటించారు. ఈ నెల 19న రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20 తెల్లవారుజాము 4:00 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

నగరంలో ఆదివారం జరిగే గణేశ్‌ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, సంబంధిత రూట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ప్రధాన నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో ఆ రూట్‌లో సీపీ బృందం పర్యటించింది. అనంతరం ట్యాంక్‌బండ్‌ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ నిమజ్జన ర్యాలీ జరిగే రూట్‌లో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. బందోబస్తు ఎలా చేస్తున్నారనే విషయంపై స్థానిక డీసీపీలను అడిగి తెలుసుకున్నారు.


Next Story