ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలెంటరీ రిటైర్మెంట్: వీఆర్ఎస్)కోరుతూ ఆయన సోమవారం ప్రభుత్వానికి ఈమెయిల్ చేశారు. తన స్వచ్ఛంద పదవీవిరమణ గురించి ఆయనే ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు. తాను ఎందుకు రాజీనామా చేయబోతున్నది తెలియజేస్తూ ప్రజలకు రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు. రెండు పేజీల లేఖను ట్విట్టర్ లో షేర్ చేశారు. 1995 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అదనపు డీజీపీ హోదాలో ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు.
ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి కారణాలపై ఓ వైపు.. ఆయన రాజకీయాల వైపు విశ్లేషణలు జరుపుతూ ఉన్నా.. మరో వైపు రాజకీయాల్లోకి ఆయన ఖచ్చితంగా వస్తారనే ప్రచారం సాగుతూ ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం లేకపోలేదని పలువురు చెప్పుకొచ్చారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించబోతున్నారనే అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ప్రవీణ్ కుమార్ రాజకీయ జర్నీపై అతి త్వరలోనే అందరికీ క్లారిటీ రానుంది.