అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాం: కాంగ్రెస్
సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు.
By అంజి
అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాం: కాంగ్రెస్
హైదరాబాద్: సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు. తరువాత కామారెడ్డి జిల్లాలో ఓ సామాన్యుడి ఇంట్లో ప్రభుత్వం సరఫరా చేసే సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. "ఈ పథకం పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారందరికీ ఆహార భద్రతను అందిస్తుంది. 80% కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు సహా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు. 30 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 13,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించడం ఒక చారిత్రాత్మక చొరవ" అని ఆయన అన్నారు.
బియ్యం సరఫరా, పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. "గోడౌన్ రవాణా నుండి రేషన్ షాపు డెలివరీ వరకు ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలను సహించకూడదు. ఏదైనా డీలర్ లేదా అధికారి దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే, కఠిన చర్యలు తీసుకుంటాము" అని ఆయన హెచ్చరించారు. అర్హులైన ఏ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ఉండేలా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అర్హత కలిగిన లబ్ధిదారుల నమోదు పనులు జరుగుతున్నాయని షబ్బీర్ అలీ తెలిపారు. అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కాంగ్రెస్ నాయకులు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.