లాక్‌డౌన్‌పై ప్రజల స్పందన ఏంటి..? సీఎం కేసీఆర్ ఆరా
CM KCR asks about Public reaction on lockdown. లాక్‌డౌన్ పొడిగింపు పై ఈ నెల 30న మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పరిణామాలపై సీఎం ఆరా తీశారు.
By తోట వంశీ కుమార్ Published on 28 May 2021 4:23 AM GMTకరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30తో లాక్‌డౌన్ ముగియనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మరో వారం లేదా పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగించవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ పొడిగింపు పై ఈ నెల 30న మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పరిణామాలపై సీఎం ఆరా తీశారు.
రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది..? లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు..? ఆంక్షల సడలింపులను ఎలా చూస్తున్నారు..? పోలీసుల పని తీరు ఎలా ఉంది..? వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిసింది. 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్ కీలకం కావవడంతో దాని గురించి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలా..? ఆంక్షలు ఏమైనా తొలగించాలా..? ఇతర నిర్ణయాలపై సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కాబట్టి అమల్లో ఉన్న ఆంక్షలను కొంతమేర సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 30న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వానాకాలం పంటల ప్రణాళిక తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు.